‘ఏప్రిల్ 8’ కథేంటో చెప్పిన చిరు

ఏప్రిల్ 8తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందంటూ మొన్న ఆసక్తికర ట్వీట్ వేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఏప్రిల్ 8 రానే వచ్చింది. ఆ తేదీతో తనకున్న అనుబంధం గురించి చిరు ఏం చెబుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ రోజు అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, అకీరా నందన్‌ల పుట్టిన రోజు కావడంతో వాళ్ల గురించే చిరు స్పందిస్తాడని అనుకున్నారు. ఐతే వాళ్ల కంటే ముందు చిరు మరొకరి ప్రస్తావనతో రోజును ఆరంభించాడు. ఆ మరొకరు ఎవరో కాదు.. చిరంజీవికి అత్యంత ఇష్టమైన దేవుడు ఆంజనేయుడు.

ఈ రోజు హనుమజ్జయంతి అని గుర్తు చేస్తూ ఆంజనేయుడితో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర ట్వీట్లు వేశాడు చిరు. ‘‘ఈ రోజు హను మజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు  ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్.

కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు.. ‘‘ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు  అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో’’ అంటూ ఆంజనేయుడి ఫొటోను చిరు షేర్ చేశాడు. మరో ట్వీట్లో బాపు వేసిన ఆంజనేయుడి చిత్రాన్ని షేర్ చేస్తూ.. ‘‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు  నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయింసిచి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …?

బాపు గారు చెప్పిన మాట “ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు” అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు’’ అని చిరు చెప్పాడు.