వంటగ్యాస్ రాయితీని ఎత్తేస్తారా ?

ఒకపుడు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వంటగ్యాస్ రాయితికి ప్రస్తుత నరేంద్రమోడి సర్కార్ మంగళం పాడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మోడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వంటగ్యాస్ సబ్సిడీని బాగా తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ రంగం సంస్ధలను తగ్గించేసి ప్రైవేటురంగానికి ప్రోత్సహం ఇవ్వాలనే అజెండాను మోడి ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మోడినే వెబినార్ ద్వారా జరిగిన సమావేశంలో చెప్పారు.

ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించటంలో భాగంగా వంటగ్యాస్ సబ్సిడీని తగ్గించేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నా మోడి ఏమాత్రం లెక్క చేయటంలేదు. ఆరేళ్ళ క్రితంతో పోల్చుకుంటే గ్యాస్ ధర ఇపుడు విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు గ్యాస్ ధర పెరిగిపోతుండటం, మరోవైపు సబ్సిడీ తగ్గిపోతుండటంతో ఆ భారమంతా వినియోగదారులపై పడుతోంది. మూడు నెలల్లో గ్యాస్ ధర రూ. 200 పెరిగింది. ప్రస్తుత నెలలో వంటగ్యాస్ ను బుక్ చేసుకున్న వాళ్ళు చెల్లిస్తున్నది సగటు ధర రు. 816 అయితే అందుకుంటున్న సబ్సిడీ కేవలం 16 రూపాయలు మాత్రమే.

మన రాష్ట్రంలో 1.42 కోట్ల వంటగ్యాస్ కనెక్షులున్నాయి. ఇందులో సుమారు 1.15 కోట్లమంది వినియోగదారులు ప్రతినెల ఒక సిలిండర్ ను బుక్ చేసుకుంటారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఏడాదికి వినియోగదారుడిపై పడే భారం రు. 4140 కోట్లు. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సబ్సిడీ ఉంటున్నా వినియోగదారులు అందుకుంటున్నది మాత్రం సగటున 16 రూపాయలు మాత్రమే. కొన్నిచోట్లయితే 4 రూపాయలు మాత్రమే సబ్సిడీ అందుతోంది.

విచిత్రమేమిటంటే మోడి సర్కార్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, మధ్య తరగతి జనాలందుకుంటున్న సబ్సిడీ ఒకటే. సంపన్నకుటుంబాల వాళ్ళు గ్యాస్ సబ్సిడీని స్వచ్చంధంగా వదులుకోమని అప్పట్లో కేంద్రప్రభుత్వం ఒక పిలుపిచ్చింది. ఆ పిలుపుకు ఎంతమంది సంపన్నులు స్పందించారో తెలీదు. మొత్తానికి తొందరలోనే వంటగ్యాస్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.