5న ఉక్కు ఉద్య‌మం.. రాజుకుంటున్న విశాఖ పోరు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ.. చేప‌ట్టిన ఉద్య‌మం తీవ్ర‌స్థాయికి చేరింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వ‌ర్యంలో మార్చి 5న బంద్‌కు కార్మిక సంఘాలు, రాజ‌కీయ ప‌క్షాలు పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉద్య‌మానికి దీనిని ప‌తాక స్థాయిగా పేర్కొంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ పిలుపునిచ్చారు.

ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్రంలో అమ‌రావ‌తి ఉద్య‌మం పీక్ స్టేజ్‌లో కొన‌సాగుతోంది. ఇప్పుడు దీనికి విశాఖ ఉక్కు ఉద్య‌మం మరింత తీవ్రం కానుంది. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును మళ్లీ అదే స్ఫూర్తితో నిలబెట్టుకోవడమే ల‌క్ష్యంగా బంద్ సాగించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌.. అనేక ఉద్య‌మాలు తెర మీదికి వ‌చ్చాయి. గతంలో ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రం కొన్ని రోజులు అట్టుడికింది. ఇక‌, త‌ర్వాత‌.. అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం.. ప్ర‌జ‌లు దండెత్తుతున్నారు. పైకి కేవ‌లం అమ‌రావ‌తి ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌ని భావించినా.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌నో భావాల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారంగా మారింది.

తాజాగా పిలుపు నిచ్చిన విశాఖ బంద్‌ను ప్ర‌తి పార్టీ కూడా రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నా..అన్ని పార్టీల‌కూ దీనిని స‌క్సెస్ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే విశాఖ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండడంతో అన్ని పార్టీల‌కూ ఇక్క‌డ పాగా వేయాల‌నే ల‌క్ష్యం ఉన్న నేప‌థ్యంలో బంద్‌ను విజ‌య వంతం చేయాల‌ని భావిస్తున్నాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబులతోపాటు పలువురు నాయకులను కమిటీ ప్రతినిధులు కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. మొత్తంగా చూస్తే.. అమ‌రావ‌తికి-విశాఖ‌కు ఉక్కు ఉద్య‌మానికి చాలా తేడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.