ఆర్కే చెప్పిన మాటలే నిజమయ్యాయిగా..?

రాబోయే రోజుల్లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాన్ని అంచనా వేసి చెప్పటం ఒక ఎత్తు. చెప్పిందే జరగటం మరో ఎత్తు. ఇటీవల కాలంలో మీడియాలో ఇలాంటి వార్తలు వచ్చి చాలా కాలమే అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే (రాధాక్రిష్ణ) తనకు తాను సొంతంగా రాసిన ఒక పొలిటికల్ ఆర్టికల్ లో.. రాజన్న కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఆ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

రాత్రి కల వస్తే.. పక్కరోజున పేపర్లో వార్తగా రాయటం ఆర్కేకు అలవాటే అంటూ మండిపడినోళ్లు.. అసలు బుర్ర ఉందా.. షర్మిల పార్టీ పెట్టటం ఏమిటి? అని ప్రశ్నించినోళ్లు ఉన్నారు. షర్మిల రాజకీయ పార్టీ పెట్టటం వెనుక ఉన్న కారణాల్ని వివరిస్తూ.. జగన్ కు.. షర్మిలకు మధ్య తేడా వచ్చిందని.. ఎన్నికల్లో విజయం తర్వాత తనను పూర్తిగా పక్కకు పెట్టేయటంపై ఆమె గుర్రుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అన్నింటికి మించి.. షర్మిల పార్టీ పెట్టటానికి తల్లి విజయమ్మ ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వార్తలోని ఒక్కోఅంశం.. ఇప్పుడిప్పుడు అక్షర సత్యమవుతోంది. పార్టీ పెట్టనున్నట్లుగా రాసిన వార్తను కొట్టిపారేయటం.. షర్మిల పేరుతో ఒక ప్రకటన రావటం తెలిసిందే. ఇది జరిగిన రెండు వారాలకే ఆమె పార్టీ పెడుతున్నట్లుగా సమావేశాలు నిర్వహించటమే కాదు.. తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమన్న వైనం తేలింది.

అదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా షర్మిల తన నోటితో తానే చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. తాను పార్టీ పెట్టటం తన అన్న జగన్ కు ఇష్టం లేదని.. తనకు తన తల్లి ఆశీస్సులు ఉన్నాయని.. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని జగనన్ననే అడగాలని ప్రశ్నించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని చూసిన తర్వాత.. మనసులోకి వచ్చే కోరిక ఒక్కటే.. ఇంత పక్కాగా ఆంధ్రజ్యోతి ఆర్కేకు సమాచారం ఎలా వచ్చింది? దాని సోర్సు ఏమిటో రివీల్ చేస్తే బాగుండన్న భావన కలుగక మానదు.