జూన్ తర్వాత వైసీపీకి తిరుగులేదా ?

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే శాసనమండలిలో రాబోయే జూన్ నాటికి పార్టీల బలాల్లో తీవ్రమైన మార్పులు రాబోతోంది. ఇపుడు మండలిలో మెజారిటి ఉన్న టీడీపీకి జూన్ తర్వాత మైనారిటిలోకి పడిపోతోంది. ఇపుడు 10 మంది సభ్యులతో రెండోపార్టీగా నిలిచిన వైసీపీ జూన్ తర్వాత మెజారిటి సాధించబోతోంది. దాంతో ఇటు అసెంబ్లీ అటు శాసనమండలిలో ఎదురు ఉండదన్న విషయం అర్ధమవుతోంది.

ప్రస్తుతం అధికార వైసీపీకి మండలిలో 12 మంది బలముంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 25 మంది సభ్యుల బలముంది. మెజారిటి ఉన్నదన్న ఏకైక కారణంతోనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదంపొందిన కొన్ని కీలకమైన బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంటోంది. సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను ప్రవేశపెట్టినపుడు మండలిలో ఎంత గొడవైందో అందరికీ తెలిసిందే.

సో అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం జూన్ నాటికి వైసీపీ బలం మండలిలో 29కి పెరుగుతుంది. ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వబోయేవి, గవర్నర్ కోటాలో చేయాల్సిన నామినేటెడ్ ఎంఎల్సీలు, స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయబోయే కోటాల్లో పదవులన్నీ వైసీపీకే దక్కుతాయని కొత్తగా చెప్పక్కర్లేదు. మార్చి నెలాఖరులోపు ఎంఎల్ఏల కోటాలో భర్తీ చేయబోయే 5 ఎంఎల్సీల స్ధానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి.

అలాగే మే 24వ తేదీతో మరో మూడు ఎంఎల్సీల పదవులు ఖాళీ అవుతాయి. ఇవికూడా ఎంఎల్ఏల కోటాలోనే భర్తీ చేయాలి. ఇపుడు వైసీపీ, టీడీపీ, బీజేపీల చేతిలో తలా ఒక ఎంఎల్సీ ఉంది. మే 24న భర్తీ చేయబోయే మూడు స్ధానాలు వైసీపీ చేతికే దక్కుతాయి. అప్పుడు మార్చిలో 5+మేలో భర్తీ చేయబోయే 3 కలిపి 8 అవుతాయి. ఇక, జూన్ 11వ తేదీకి గవర్నర్ కోటాలో నామినేట్ అయిన 4 ఎంఎల్సీల పదవీకాలం పూర్తవుతుంది. ఇవన్నీ వైసీపీకి దక్కుతాయనటంలో సందేహం లేదు.

స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాలు జూన్ 18 నాటికి 11 ఖాళీ అవుతాయి. వీటిలో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల స్ధానాలు ఇఫ్పటికే ఖాళీ ఉన్నాయి. ఈ కోటాలో టీడీపీకి చెందిన 7 మంది సభ్యులు రిటైర్ అయిపోతున్నారు. ఈ కోటాలో భర్తీ చేయాల్సిన స్ధానాలన్నీ అధికారపార్టీ ఖాతాలోనే పడతాయనటంలో సందేహం లేదు. ఇలా మొత్తం మీద జూన్ చివరకు వైసీపీ సభ్యుల బలం మండలిలో 29కి పెరుగుతుంది. దాంతో బిల్లుల ఆమోదంలో వైసీపీకి మండలిలో కూడా తిరుగుండదనే చెప్పాలి.