పాద‌యాత్ర మిగిల్చిన ప‌దునైన ప్ర‌శ్న‌లు.. సాయిరెడ్డికి స‌వాలే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు.. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సాగించిన పాద‌యాత్ర స‌క్సెస్ అయిందా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. అనేక ప్రశ్న‌ల‌ను మాత్రం ఆయ‌న‌కు మిగిల్చింద‌నేది వాస్త‌వం. ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర ఆయన పాదయాత్ర చేపట్టిన సాయిరెడ్డి.. వైసీపీ నేతలు, శ్రేణులు, సామాన్య ప్రజలతో గాజువాక వ‌ర‌కు త‌న యాత్ర‌ను సాగించారు. గాజువాక ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటు నినాదాలు చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనివ‌ల్ల వ‌చ్చే ఫ‌లితం ఏంట‌నేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాం శంగా మారింది.

ఎందుకంటే.. విజ‌య‌సాయి రెడ్డి చేసిన పాద‌యాత్ర వ‌ల్ల స్టీల్ ప్లాంట్ పై తీసుకున్న నిర్ణ యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకునే అవ‌కాశం లేద‌న్న‌ది ఏపీ ప్ర‌జ‌ల‌కే కాదు.. అంద‌రికీ తెలిసిన విష‌యం. కేంద్రం ఒక నిర్ణ‌యం తీసుకుంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వెన‌క్కి తీసుకున్న దాఖ‌లాలు లేవు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌న‌ని చెప్పింది. దీనిపై ఎంత మంది ఎన్ని రూపాల్లో విజ్ఞ‌ప్తులు చేసినా.. ఆందోళ‌న‌లు చేసినా, తిట్టినా.. స్పందించ‌లేదు.

ఇక‌, రైతుల‌కు సంబందించిన సాగు చ‌ట్టాల‌పైనా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో సాయిరెడ్డి పాద‌యాత్ర కూడా ఒక మిష‌గానే మిగిలిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి పాద‌యాత్ర ద్వారా విశాఖ ఉక్కును సాధించ‌లేమ‌ని.. సాయిరెడ్డికి కూడా తెలుసు.

అయితే.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. రాజీనామా చేయ‌డం, ప‌ల్లా శ్రీనివాస‌రావు.. ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూర్చోవ‌డం వంటివి పెద్ద ఎత్తున హైలెట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ వెనుక‌బ‌డింద‌నే కామెంట్లు వ‌చ్చాయి. వీటిని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డంతోపాటు.. విశాఖ‌లో వైసీపీ వెనుక‌బ‌డితే..త‌న‌కు బ్యాడ్ నేమ్ వ‌చ్చే అవ‌కాశంతో పాటు.. ప్ర‌స్తు తం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటుంద‌ని.. ఫ‌లితంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న‌కు మార్కులు త‌గ్గుతాయ‌ని గుర్తించిన సాయి రెడ్డి.. పాద‌యాత్ర‌కు రెడీ అయ్యార‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు పాద‌యాత్ర అయితే.. చేశారు. కానీ, అత్యంత కీల‌క‌మైన ఫ‌లితాన్ని మాత్రం ఆయ‌న రాబ‌ట్ట‌లేక పోగా.. సాయిరెడ్డి చేసిన యాత్ర కేవ‌లం రాజ‌కీయ యాత్ర‌కు మాత్ర‌మే ప‌నికి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.