గంటా షాకింగ్ నిర్ణయం.. ఉప ఎన్నికల్లో పోటీ చేయరట

మన దగ్గరి రూపాయిని అన్యాయంగా తీసుకుంటే వేదన చెందుతాం. ఇదెక్కడి అన్యాయమని బాధ పడతాం. అంతకు మించి ఆవేశానికి గురి అవుతాం. అలాంటిది.. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కేంద్రం అమ్మేయాలని డిసైడ్ అయితే.. ఏపీ ప్రజలు ఎంతలా స్పందించాలి. మరెంత ఆగ్రహాన్ని ప్రదర్శించాలి. కానీ.. ఇంత జరుగుతున్నా.. గుంభనంగా ఉంటున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలాంటి వేళ.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇప్పటివరకు ఆయన రాజీనామాను ఆమోదించింది లేదు. అయితే.. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారన్న ఆశను గంటా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో అన్ని పార్టీల పాపం ఉందన్న ఆయన.. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తన వ్యక్తిగతమని.. రానున్న ఉప ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు గంటా.

తనకు బదులుగా.. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని బరిలోకి దించాలన్న సూచన చేశారు. సీఎం జగన్ తన రాజకీయ పంథాను వదిలేసి.. ఉద్యమ పంథాలోకి రావాలన్న ఆకాంక్షను గంటా వ్యక్తం చేస్తున్నారు. తన స్ఫూర్తితో మిగిలిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని ఆయన కోరుతున్నారు. పోరాటాల ద్వారానే స్టీల్ ఫ్లాంట్ ను నిలబెట్టుకోగలమన్న వాదనను ఆయన వినిపిస్తున్నారు.

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటివేళ.. పదవుల్లో ఉండే కన్నా ప్రజల్లో ఉండటం.. వారి ఆకాంక్షకు తగ్గట్లుగా పోరాటాలు చేయాలని భావిస్తున్న గంటా.. తనకు పదవుల కంటే కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకపోవటమే ముఖ్యమన్న బలమైన సందేశాన్ని ప్రజలకు పంపించే ప్రయత్నమే ఉప ఎన్నికకు దూరంగా ఉండటంగా చెబుతున్నారు. మరి.. ఆయన వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.