ఖమ్మంకు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసా ?

ఈనెల 21వ తేదీన షర్మిల ఖమ్మం జిల్లా పర్యటనపై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. మొన్నటి 9వ తేదీన తెలంగాణా రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజన్న రాజ్యం తేవటమే తన లక్ష్యంగా షర్మిల ప్రకటించారు. పార్టీ, జెండా, విధి విదానాలు ఇంకా ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతల్లోల మాత్రం షర్మిలపై వ్యతిరేకత పెరిగిపోతోంది. షర్మిలను టార్గెట్ గా చేసుకుని టీఆర్ఎస్+బీజేపీ+కాంగ్రెస్ నేతలు ఆరోపణలను, విమర్శలను మొదలుపెట్టేయటమే ఆశ్చర్యంగా ఉంది.

మొదటి సమావేశం నల్గొండ జిల్లాలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానులతో ఏర్పాటు చేసిన షర్మిల తన రెండో సమావేశానికి నేరుగా ఖమ్మం బయలుదేరి వెళుతున్నారు. ఖమ్మం జిల్లాలోని నేతలతో షర్మిల భేటీకి వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోటస్ పాండ్ నుండి భారీ కాన్వాయ్ తో ఆమె ఖమ్మం చేరుకునేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.

జిల్లాలోని గిరిజన సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 43 మండలాల్లో సుమారు 30 మండలాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో జగన్ తెలంగాణాపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా జిల్లాలోని ఖమ్మం ఎంపితో పాటు మూడు అసెంబ్లీ స్ధానాల్లో గెలుచుకుంది. ఇందుకనే ఈ జిల్లాపై షర్మిల ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.