కార్తి సినిమాపై 60 కోట్లా?

కార్తి సినిమాపై 60 కోట్లా?

పీవీపీ సినిమా.. భారీ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాకు ఈ బడ్జెట్ వర్కవుట్ అవుతుందా లేదా అని చూడకుండా భారీగా ఖర్చు పెట్టడం పొట్లూరి వరప్రసాద్‌కు అలవాటు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘వర్ణ’కు రూ.60 కోట్లు పెట్టడం ఆయనకే చెల్లింది. ఆ తర్వాత ‘సైజ్ జీరో’ విషయంలోనూ అవసరానికి మించే ఖర్చు పెట్టారు. ‘ఊపిరి’ చివరికి కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలవడానికి కూడా ఇలా ఓవర్ బడ్జెటే కారణం. ఇక ‘బ్రహ్మోత్సవం’ సంగతేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి అనుభవాలున్నా సరే.. పీవీపీ మాత్రం అస్సలు రాజీ పడట్లేదు. కార్తి హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘కాష్మోరా’ను కూడా ఆయన రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టారట.

ఇవాళే ‘కాష్మోరా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. సందేహమే లేదు.. అద్భుతంగా ఉంది ఆ పోస్టర్. కార్తి లుక్ చూసి జడుసుకోవాల్సిందే. హాలీవుడ్ సినిమాల లుక్ కనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తుంటే. ‘యుగానికి ఒక్కడు’ తరహాలో కార్తి మరో ప్రయోగం చేస్తున్నట్లున్నాడు. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీవీపీ సంస్థ రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడైంది. మద్రాస్, ఊపిరి లాంటి విజయాలతో కార్తి ఊపుమీదున్నప్పటికీ.. అతడి మీద ఇంత బడ్జెట్ పెట్టడమన్నది కచ్చితంగా రిస్కే. మరి పీవీపీ కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి. భారతీయ సినీ చరిత్రలో తొలిసారిగా 3డి ఫేస్ స్కానింగ్, 360 డిగ్రీ ఓమ్నీ డైరెక్షనల్ కెమెరా టెక్నాలజీని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారట. ఈ సినిమాలో నయనతార, శ్రీదివ్యలు హీరోయిన్లుగా  నటిస్తుండగా.. కార్తి తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. దీపావళి కానుకగా ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది.

More:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు