మీర్జాపూర్ ట్రెండింగ్.. ఎందుకు?

ఇండియాలో వచ్చిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఉత్తరప్రదేశ్‌లో లోకల్ మాఫియా నేపథ్యంలో చాలా రియలిస్టిగ్గా.. రస్టిగ్‌గా సాగిన ఈ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులోని బూతులు, ఎరోటిక్ సన్నివేశాలు, వయొలెన్స్ ఓ వర్గం ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చాయి. తెలుగు ప్రేక్షకులు సైతం అమేజాన్ ప్రైమ్‌లో ‘మీర్జాపూర్’ బూతులతో బాగా కనెక్టయ్యారు.

గత ఏడాది నవంబర్ 23న ‘మీర్జాపూర్’ రెండో సీజన్ స్ట్రీమ్ కాగా.. అది ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు లేకపోయినా వ్యూస్ అయితే భారీగానే వచ్చాయి. తెలుగు వెర్షన్ వెంటనే స్ట్రీమ్ చేయనందుకు మనవాళ్లు గొడవ గొడవ చేశారు కూడా. కొంత గ్యాప్ తర్వాత తెలుగు ఆడియో కూడా అందుబాటులోకి వచ్చింది. ఓవరాల్‌గా చూస్తే తొలి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్ ఏమంత ఎగ్జైటింగ్‌గా లేదన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఆ సిరీస్ గురించి పెద్దగా డిస్కషన్ లేదు.

ఐతే ఇలాంటి టైంలో ఉన్నట్లుండి #mirzapur హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ కావడం విశేషం. ఉన్నట్లుండి ఇదెందుకు ట్రెండ్ అవుతోందని అంతా ఆశ్చర్యపోయారంతా. విషయం ఏంటంటే.. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో ఉత్తరప్రదేశ్‌ను చాలా చెడుగా చూపించారని, దీని వల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తిందని కోర్టులో పిటిషన్ వేస్తే.. భారత సర్వోన్నత న్యాయస్థానం దీనిపై స్పందించింది. మీర్జాపూర్ మేకర్స్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. పిటిషనర్ అభ్యంతరాలు, ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ఐతే ఇప్పటికే ప్రతి చిన్న విషయం మీదా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిలిం మేకర్స్‌కు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని.. మనోభావాల పేరుతో ప్రతిదాన్నీ బూతద్దంలో చూపించి సినిమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించడం, నోటీసులు ఇవ్వడం లాంటివి చేస్తే ఫిలిం మేకర్స్‌ ఇక ఏం తీస్తారనే అభిప్రాయం సినీ పరిశ్రమ నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై మీర్జాపూర్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.