కన్నీళ్లు పెట్టుకున్న టీ మంత్రి.. వారిద్దరిని దత్తత తీసుకుంటారట

తెలంగాణ రాష్ట్ర గిరిజన.. మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. మానత్వంతో ఆమె స్పందించిన తీరుతో అందరి మనసుల్ని దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో డోర్నకల్ కు చెందిన 28 ఏళ్ల రషీద్ పాషా మరణించటం తెలిసిందే. దీంతో.. పాషా ఇద్దరు కుమార్తెలు అనాథలైనట్లుగా తెలుసుకున్న మంత్రి.. ఆదివారం డోర్నకల్ కు వచ్చారు. వారి ఇద్దరు పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు.

తానురాష్ట్రానికి మంత్రిని కావొచ్చుకానీ.. వారిద్దరికి మాత్రం తల్లినని పేర్కొన్నారు. నాలుగేళ్ల కరిష్మాని ఒడిలో పెట్టుకొని.. ప్రమాదంలో గాపడిన కాలికి ఆపరేషన్ జరిగిన తొమ్మిదేళ్ల సుహానాను ఓదార్చారు. ఊహ తెలియని వయసులో ఇంత కష్టమా? ఆ దేవుడికి దయ లేదా? అంటూ వాపోయి.. కన్నీళ్లు పెట్టుకున్న ఆమె.. వారిద్దరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ చిల్డ్రన్స్ హోంలో చేర్పిస్తానని.. వారి బాగోగులు తానే స్వయంగా చూస్తానని మాటిచ్చారు.

పిల్లల బంధువుల అంగీకారంతో చట్టబద్ధమైన చర్యల అనంతరం.. ఇద్దరు పిల్లల్ని తాను దత్తత తీసుకుంటానని తేల్చిన ఆమె.. పిల్లలకు తోడుగా వచ్చి.. వారి సంరక్షణ బాధ్యతల్ని తీసుకునే వారికి హోంలో ఉద్యోగం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంతో అనాధులుగా మారిన చిన్నారుల విషయంలో మంత్రి స్పందించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.