క్రాక్ వారం రోజుల్లో ఎంత తెచ్చింది?

కొత్త ఏడాదిలో టాలీవుడ్‌కు అదిరే ఆరంభాన్నిచ్చింది క్రాక్ సినిమా. సంక్రాంతి రేసులో మొద‌ట‌గా బ‌రిలోకి దిగిన ఈ చిత్రం వారం రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసుకుంది. గ‌త శ‌నివార‌మే విడుద‌ల కావాల్సిన ఈ సినిమాకు కొన్ని స‌మ‌స్య‌లు ఎదురై.. ఒక రోజు ఆల‌స్యంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి రోజు రెవెన్యూ కోల్పోవ‌డం లోటే అయిన‌ప్ప‌టికీ.. సినిమాకు మంచి టాక్ రావ‌డంతో ఆ ప్ర‌భావం మ‌రీ గ‌ట్టిగా ఏమీ ప‌డ‌లేదు.

సంక్రాంతికి వ‌చ్చిన మిగ‌తా సినిమాల‌తో పోలిస్తే దీనికే మంచి టాక్ రావ‌డం, వ‌సూళ్లు నిల‌క‌డ‌గా కొన‌సాగ‌డంతో ఈ చిత్ర‌మే పండుగ విజేత‌గా నిలిచింది. చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది. వారం రోజుల వ్య‌వ‌ధిలో ఈ చిత్రం రూ.40 కోట్ల‌కు పైగా గ్రాస్, 23 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి లాభాల బాట‌లో న‌డుస్తోంది. ర‌వితేజ కెరీర్లోనే ఇది హైయెస్ట్ ఫ‌స్ట్ వీక్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డం విశేషం.

సంక్రాంతికి ఇంకో మూడు సినిమాల‌తో పోటీ ప‌డి.. థియేట‌ర్లు 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతో న‌డుస్తున్న స‌మ‌యంలో ర‌వితేజ‌కు వ‌సూళ్ల ప‌రంగా తొలి వారంలో రికార్డు సినిమాగా నిల‌వ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి, లాభాల్లో ప‌య‌నిస్తోంది. తొలి వారంలో నైజాంలో రూ.7.22 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఉత్త‌రాంధ్ర‌లో రూ.2.56 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఆంధ్రాలోని మిగ‌తా అన్ని ప్రాంతాల్లో క‌లిపి రూ.8 కోట్ల దాకా షేర్ వ‌చ్చింది. రాయ‌ల‌సీమ‌లో రూ.3.9 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది క్రాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి గ్రాస్ రూ.36 కోట్లు దాట‌గా.. షేర్ రూ.22 కోట్ల‌కు చేరువ‌గా ఉంది.

మిగ‌తా ఏరియాల్లో గ్రాస్ రూ.2 కోట్లు, షేర్ రూ. కోటికి పైగా వ‌చ్చింది. ఆదివారం సినిమా హౌస్‌ఫుల్స్‌తో న‌డుస్తున్న నేప‌థ్యంలో ఈ ఒక్క రోజులో షేర్ రూ.2 కోట్ల‌కు త‌గ్గ‌క‌పోవ‌చ్చు. వ‌చ్చే వార‌మంతా కూడా ఈ సినిమా జోరు కొన‌సాగించే అవ‌కాశ‌ముంది. రూ.30 కోట్ల షేర్ మార్కును ఈజీగా దాటేసి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డం ఖాయం. క్రాక్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను దాదాపు రూ.17 కోట్ల‌కు అమ్మ‌డం గ‌మ‌నార్హం.