అల్లుడు అదుర్స్ చూసిన వాళ్ల‌ను అడ‌గండి

ఈ సంక్రాంతికి విడుద‌లైన చిత్రాలన్నింట్లోకి బ్యాడ్ రివ్యూలు వ‌చ్చింది అల్లుడు అదుర్స్ సినిమాకే. ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయిన ఫార్ములాతో ఈ సినిమా తీసి నిరాశ ప‌రిచాడు ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్. లాజిక్ లేని, రొటీన్ క‌థా క‌థ‌నాలు.. మైండ్ లెస్ కామెడీ.. విప‌రీత‌మైన హ‌డావుడి సినిమాను నీరుగార్చేశాయి.

తొలి రోజు ఓపెనింగ్స్ ప‌ర్వాలేదు కానీ.. ఆ త‌ర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ ప‌రీక్ష‌కు నిల‌వలేక‌పోయింది. ఐతే చిత్ర బృందం మాత్రం అల్లుడు అదుర్స్ సూప‌ర్ హిట్ అనే అంటోంది. శ‌నివారం స‌క్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుక‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడు. సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావ‌డంపై ప‌రోక్షంగా అత‌ను స్పందించాడు.

సినిమా గురించి ఎవ‌రేమ‌న్నార‌న్న‌ది ముఖ్యం కాద‌ని.. సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌ను అడిగితే వాళ్లెంత‌గా ఎంజాయ్ చేశారో చెబుతార‌ని.. జెన్యూన్ టాక్ తెలుస్తుంద‌ని.. వారి ఫీడ్ బ్యాక్‌ను బ‌ట్టి మిగ‌తా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌ని అత‌న‌న్నాడు. దీన్ని బ‌ట్టి చూస్తే రివ్యూల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని శ్రీనివాస్ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది.

గ‌త ఏడాది క‌రోనాతో బాధ ప‌డ్డ జ‌నాల‌కు మంచి వినోదం అందించి త‌మ బాధ‌ల‌న్నీ మ‌రిచిపోయేలా చేయాల‌ని ఇలాంటి సినిమా చేశామ‌ని శ్రీనివాస్ తెలిపాడు. క‌రోనా విరామం త‌ర్వాత చాలామంది సినిమాల‌ను మొక్కుబ‌డిగా చుట్టేశార‌ని.. కానీ త‌మ నిర్మాత మాత్రం అలా రాజీ ప‌డ‌లేద‌ని.. భారీ సెట్టింగ్స్ వేసి.. ఏమాత్రం రాజీ ప‌డ‌కుండా స‌న్నివేశాలు, పాట‌లు, ఫైట్లు చిత్రీక‌రించేలా చూశార‌ని.. ఆ భారీత‌నం సినిమా నిండా క‌నిపిస్తుంద‌ని శ్రీనివాస్ చెప్పాడు.