ఫ్లాప్ సినిమాకు రీమేకట‌

ఈ సంక్రాంతికి భారీ అంచనాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది మాస్ట‌ర్ సినిమా. కానీ ఆ అంచ‌నాల్ని అందుకోవ‌డంలో ఈ చిత్రం విఫ‌ల‌మైంది. ముందు నుంచి ఉన్న హైప్ వ‌ల్ల దీనికి ఓపెనింగ్స్ విష‌యంలో ఢోకా లేక‌పోయింది. అటు త‌మిళంలో, ఇటు తెలుగులో ఆరంభ వ‌సూళ్లు బాగానే వ‌చ్చాయి. పండుగ సెల‌వులు కొన‌సాగుతుండ‌టం.. రాబోయేది వీకెండ్ కావ‌డంతో ఆదివారం వ‌ర‌కు మాస్ట‌ర్ జోరుకు ఢోకా లేక‌పోవ‌చ్చు.

ఐతే ఈ సినిమాపై త‌మిళంలో బ‌య్య‌ర్లు భారీ పెట్టుబ‌డులు పెట్టిన నేప‌థ్యంలో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌డం క‌ష్ట‌మే అనుకుంటున్నారు. తెలుగు వ‌ర‌కు సినిమా సేఫ్ అనుకోవ‌చ్చు. ఐతే ఒక సినిమాను రీమేక్ చేయాలంటే వ‌సూళ్ల కంటే కూడా కంటెంట్ ఎలా ఉంద‌న్న‌ది చూస్తారు. ఆ కోణంలో చూస్తే మాస్ట‌ర్ రీమేక్‌కు ప‌నికి రాని సినిమానే. ఇందులో ఏమంత కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. ప్రేక్ష‌కుల‌ను ఎగ్జైట్ చేసే అంశాలు పెద్ద‌గా లేవు.

అయినా స‌రే.. మాస్ట‌ర్‌ను హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతుండ‌టం విశేషం. త‌మిళంలో మాస్ట‌ర్ సినిమాను నిర్మించి 7 స్క్రీన్ స్టూడియోస్‌తో క‌లిసి ఎన్మోల్ ఇండియా, సినీ2 స్టూడియోస్ సంస్థ‌లు హిందీలో మాస్ట‌ర్ చిత్రాన్ని రీమేక్ చేయ‌బోతున్నాయి. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఐతే ఒరిజిన‌ల్‌ను ఉన్న‌దున్న‌ట్లు రీమేక్ చేయ‌కుండా.. అడాప్ష‌న్ లాగా తీస్తార‌ట‌. ఇంకా ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు ఎవ‌రు పోషిస్తార‌న్న‌ది తేల‌లేదు.

క‌థాంశం ప్ర‌కారం చూస్తే విజ‌య్, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ల‌ను పెద్ద స్టార్లే చేయాలి. లేకుంటే మాస్ట‌ర్ రీమేక్ అస్స‌లు వ‌ర్క‌వుట్ కాదు. ఐతే ప్ర‌స్తుతం నార్త్ ఇండియా చెప్పుకోద‌గ్గ హిందీ సినిమాలేవీ విడుద‌ల కాక‌పోవ‌డంతో మాస్ట‌ర్ చిత్రాన్ని విజ‌య్ ది మాస్ట‌ర్ పేరుతో సంక్రాంతి సంద‌ర్భంగానే పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఇలా స‌రైన టాక్ రాని, అల్రెడీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ కూడా రిలీజైన చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసి ఏం సాధిస్తార‌న్న‌దే అర్థం కాని విష‌యం.