అవును… ప‌వ‌న్ సినిమాలో త్రివిక్ర‌మ్‌

చాన్నాళ్లుగా ప్ర‌చారంలో ఉన్న విష‌య‌మే. ఇప్పుడు అధికారికంగా ఖ‌రారైంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ చేయ‌నున్న అయ్య‌ప్ప‌నుం కోషీయుంలో త్రివిక్ర‌మ్ కూడా భాగ‌స్వామి అయ్యాడు. ఆయ‌న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేతో పాటు మాట‌లు రాస్తున్న విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఒక స్పెష‌ల్ వీడియో ద్వారా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది.

త్రివిక్ర‌మ్ ఇలా ప‌వ‌న్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌కుండా మాట‌లు రాయ‌డం కొత్తేమీ కాదు. ఇంత‌కుముందు తీన్ మార్ సినిమాకు కూడా ఆయ‌న మాట‌ల సాయం చేశారు. ఇక నితిన్ హీరోగా ప‌వ‌న్ నిర్మించిన చ‌ల్ మోహ‌న రంగ సినిమాకు కూడా ఆయ‌న ర‌చనా స‌హ‌కారం అందించారు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాకు మాట‌ల‌తో పాటు స్క్రీన్ ప్లే కూడా స‌మ‌కూరుస్తున్నాడు త్రివిక్ర‌మ్.

అయ్యారే, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు లాంటి చిన్న సినిమాలు తీసిన సాగ‌ర్ చంద్ర‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మేంటి అని చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు కానీ.. ఆల్రెడీ ఒక భాష‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన సినిమా కావడం, పైగా మార్పులు, చేర్పులు, మాట‌ల బాధ్య‌త త్రివిక్ర‌మే తీసుకోవ‌డంతోనే ఈ ప్రాజెక్టు కోసం ధైర్యంగా సాగ‌ర్‌ను తీసుకున్న‌ట్లు ముందు నుంచి ఇండ‌స్ట్రీ జ‌నాలు చెబుతూనే ఉన్నారు. త్రివిక్ర‌మ్ మాట‌లు రాసినా స‌రే.. సినిమా ఆయ‌నే తీసిన‌ట్లుగా ఉంటుంది. ఆ ముద్ర స్క్రిప్టులో అంత బ‌లంగా ఉంటుంది. తీన్ మార్ ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌.

అయ్య‌ప్ప‌నుం కోషీయుంకు మాట‌ల‌తో పాటు స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా త్రివిక్ర‌మ్‌దే. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడిగా సాగ‌ర్ పాత్ర నామ‌మాత్ర‌మే అనుకోవాలి. అన్నీ బాగా అమ‌రిన ఈ సినిమాను మంచి టేకింగ్‌తో నిల‌బెడితే సాగ‌ర్ ప్ర‌తిభ చాటుకున్న‌ట్లే. ఒరిజిన‌ల్లో బిజు మీన‌న్ చేసిన పోలీస్ పాత్ర‌ను ప‌వ‌న్ ఇక్క‌డ చేస్తుండ‌గా.. ఆయ‌న స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. పృథ్వీరాజ్ క్యారెక్ట‌ర్‌ను రానా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు.