ఉప్పెన ఎదురు చూపులు ఫలించినట్లే

పది నెలల కిందటే ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధమైన సినిమా ‘ఉప్పెన’. మెగా ఫ్యామిలీ కొత్త కుర్రాడు, చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గత ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సరిగ్గా అంతకు రెండు వారాల ముందు కరోనా వచ్చి థియేటర్లను మూత వేయించింది. ఇక అప్పట్నుంచి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూసి చూసి అలసిపోయింది ఈ చిత్ర బృందం.

మధ్యలో ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త కుర్రాడిని ఓటీటీల ద్వారా అరంగేట్రం చేయించడం సరి కాదని మైత్రీ మూవీ మేకర్స్ స్థిరంగా ఓ నిర్ణయంతో ఉండిపోయింది. డిసెంబర్లో థియేటర్లు పున:ప్రారంభమైనా.. వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అని ఆగారు. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడిక ఒక మంచి ముహూర్తం చూసి సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం.

‘ఉప్పెన’ పూర్తి స్థాయి ప్రేమ కథ కావడంతో వేలంటైన్స్ డే సీజన్లో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. వేసవికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోవడం, అక్కడ పోటీ తీవ్రంగా ఉండటంతో మధ్యే మార్గంలో ఫిబ్రవరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో సినిమాలు సరిగా ఆడవు కానీ.. ఫిబ్రవరి కొంచెం నయమే. ఈ నెలలోనే ‘నేను లోకల్’ లాంటి బ్లాక్‌బస్టర్, ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్ వచ్చాయి.

సంక్రాంతితో పోలిస్తే వసూళ్లు తగ్గుతాయి కానీ.. పరిస్థితి మరీ ఇబ్బందికరంగా అయితే ఉండదు. ఫిబ్రవరి 5కే ‘జాంబీరెడ్డి’ సినిమా కూడా ఫిక్స్ అయినప్పటికీ దాంతో పోలిస్తే జానర్ పూర్తి భిన్నం కావడం, ఇలాంటి రెండు చిన్న సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర స్కోప్ ఉండటంతో ‘ఉప్పెన’ను అదే డేట్‌కు ఖాయం చేశారట. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి అనే కొత్తమ్మాయే కథానాయికగా నటించింది.