జగన్…ప్రజలకు ముద్దులు కాదు..పాలసీలు కావాలి: పవన్

తుని నియోజకవర్గం కొత్తపాకలలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుపై ఆందోళన జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివీస్ బాధితుల నిరసనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మద్ధతు తెలుపుతూ ఈరోజు తూర్పుగోదావరిలో పర్యటించారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాదయాత్రలు చేసే జగన్ ప్రజలపై ప్రేమను ముద్దులతో చూపుతారని, కానీ ఆయన ప్రేమ పాలసీల రూపంలో చూపించాలని ఎద్దేవా చేశారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందిపడుతుంటే జగన్ మోహన్ రెడ్డి వారికి ఎందుకు న్యాయం చేయడం లేదని పవన్ ప్రశ్నించారు. దివీస్ భూములు జగన్, వైసీపీ నేతల సొత్తా అని ప్రశ్నించారు. దివీస్ సంస్థకు వ్యతిరేకంగా పోరాడి భూములివ్వని 36 మంది రైతులను విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. తాము కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకం కాదన్న పవన్ ప్రజల కన్నీళ్లపై వ్యాపారవేత్తల ఎదుగుదల మంచిది కాదన్నారు.

తాను కూడా వైసీపీ నాయకుల్లా మాట్లాడగలనని, అది తన సంస్కారం కాదని పవన్ అన్నారు. పోలీసుల తీరును తప్పుపట్టబోమని, నిన్న సభకు అనుమతిస్తామని, ఈరోజు నిరాకరించడం సరికాదని అన్నారు. పోలీసులపై ప్రభుత్వ ఒత్తిడిని ఈ ఘటన తెలియజేస్తుందని తెలిపారు. పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు తాము వ్యతిరేకం అని చెప్పారు. సముద్రంలో వ్యర్థాలను కలుపుతామంటే ఒప్పుకోబోమన్నారు. మరోవైపు, పవన్ పర్యటన నేపథ్యంలోనే దివిస్ ల్యాబరేటరిస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయోద్దని లేఖలో సూచించింది. హ్యాచరీస్ కారణంగా గ్రామీణ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని.. వ్యర్థాల కారణంగా వారు ఆ అవకాశాలు కోల్పోయే ఛాన్స్ ఉందని భావిస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ తెలిపారు.