ఆయన పేరు కొడాలి నాని.. ఆయన అలానే మాట్లడతారు

నిండు కుండలో పాలు ఉన్నా.. చిటికెడు ఉప్పు చాలు.. మొత్తాన్ని పాడు చేయటానికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. సంక్షేమం కోసం కష్టపడుతున్న జగన్ కు భిన్నంగా ఆయన పార్టీకి చెందిన కొద్దిమంది నేతల పుణ్యమా అని.. తరచూ వివాదాల్లోకి చిక్కుకుపోవాల్సి వస్తోంది.

ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వారి మాటలు ఉండటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. అలాంటి వారిలో మంత్రి కొడాలి నాని ముందుంటారు.

తనకు తోచింది మాట్లాడే ఆయన.. తన మాటల కారణంగా జరిగే డ్యామేజ్ గురించి అస్సలు పట్టించుకోరు. తాజాగా ఆయనకు చెందిన వారు నిర్వహించే పేకాట శిబిరం మీద పోలీసులు దాడులు చేయటం.. పెద్ద ఎత్తున నగదు.. వాహనాల్ని సీజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అనంతరం సీఎం జగన్ ను కలిసి వచ్చారు.

ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన ఆయన.. మీడియా సమావేశంలో తన నోటికి వచ్చినట్లు మాట్లాడారు. విన్నంతనే.. వెగటు పుట్టించేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది. ఆయన మాటల్ని ఆయన మాటల్లోనే వింటే సరి. ఆయనేమన్నారంటే..

పేకాట క్లబ్బుల్లో మీ ప్రధాన అనుచరులే ఉన్నారట కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే.. కొడాని నాని సమాధానం ఇలా ఉంది.

“ఏమో ఉంటే, ఒకరిద్దరు ఉంటారు. ఉంటే ఏమవుతుంది? ఏమైనా ఉరి శిక్ష వేస్తారా? తీసుకు వెళతారు. కోర్టుకు వెళతారు. ఫైన్ కట్టి వచ్చేస్తారు. ఏ శిక్ష వేస్తారు? పట్టుకుంటే ఫైన్ కడతారు. మళ్లీ వెళతారు. అందుకే కదా విచ్చలవిడిగా ఆడేది. భయపడంది అందుకే కదా. దీన్ని అరికట్టేందుకే వైఎస్ జగన్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఉరిశిక్షలు ఏమైనా ఉన్నాయా? నా తమ్ముడే ఉంటే ఉండొచ్చు. ఏం ఉరేస్తారా? దీనిపై ముఖ్యమంత్రిని అడగకపోతే ఏమవుతుంది? యాభయ్యో.. వంద రూపాయలో ఫైన్ వేస్తారు? దానికి ముఖ్యమంత్రి దగ్గరకి పరిగెత్తుకు వెళ్లాలా? నేను రోడ్డు పనుల కోసం సీఎంను కలిశాను. ప్రజల కోసమే కలిశా. గుడివాడ ప్రజలు నాలుగు సార్లు గెలిపించారు. వారి పనుల కోసమే వెళతాను. పేకాట ఆడేవారిని రోజూ నాలుగైదు చోట్ల పోలీసులు పట్టుకుంటారు. ఎక్కడో ఓ చోట పట్టుకుంటూనే ఉన్నారు. జనరల్‌గా తనిఖీలు జరుగుతుంటాయి. నిన్నటి ఘటనతో నామీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.