నష్టాన్ని కవర్ చేసేందుకు ‘మాస్టర్’ ప్లాన్


ఇండియాలో కరోనా-లాక్ డౌన్ కంటే ముందు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న వాటిలో అత్యంత భారీ, అత్యధిక అంచనాలున్న సినిమా అంటే.. ‘మాస్టర్’యే. తమిళంలో గత కొన్నేళ్లలో రజినీకాంత్‌ను మించి పెద్ద స్టార్‌గా ఎదిగిన విజయ్ హీరోగా నటించిన చిత్రమిది. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దీనిపై ముందు నుంచి అంచనాలు మామూలుగా లేవు. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్లో తమిళ సంవత్సరాదికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా వచ్చి ప్రణాళికల్ని దెబ్బ కొట్టింది.

మధ్యలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేస్తారని గట్టి ప్రచారం జరిగింది కానీ.. నిర్మాతలు తలొగ్గలేదు. మంచి ఆఫర్లు వచ్చినా సరే.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచే రోజుల్లోనే తమ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు కానీ.. వారు కోరుకున్న రోజులు ఎప్పటికి వస్తాయో స్పష్టత లేదు.

ఐతే ఇటీవలే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెళ్లి విజయ్‌ను కలవడం.. నిర్మాతలతోనూ చర్చించడంతో 50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనే సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేసేద్దామన్న ఆలోచనపై సీరియస్‌గానే ఉన్నారట. త్వరలోనే ప్రకటన రావచ్చని అంటుున్నారు. అదే జరిగితే తమిళనాడులో ఉన్న ప్రతి థియేటర్‌లోనూ ఈ సినిమానే ఆడుతుంది సంక్రాంతికి. దీనికి పోటీ రాకుండా చూసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాక రిలీజ్ ఆలస్యం కావడం వల్ల, 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండటం వల్ల తలెత్తే నష్టాన్ని కవర్ చేసేందుకు ఈ చిత్రాన్ని బహు భాషల్లో రిలీజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇంతకుముందు అయితే తమిళం, తెలుగులో మాత్రమే రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు హిందీ, కన్నడ వెర్షన్లు కూడా జోడించారు. ఈ మేరకు డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆ రెండు భాషల్లోనూ భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మలయాళంలోకి ఈ సినిమాను డబ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ తమిళ వెర్షనే స్ట్రెయిట్ సినిమాల స్థాయిలో రిలీజవుతుంది. విజయ్‌కు అంత క్రేజుందక్కడ.