మాస్ రాజా డిజాస్ట‌ర్ల ఎఫెక్ట్ ఏమీ లేదే..


మాస్ రాజా ర‌వితేజ చివ‌రి హిట్ ఏదంటే.. ఆయ‌న వీరాభిమానులు కూడా వెంట‌నే స‌మాధానం చెప్ప‌డానికి త‌డుముకోవాల్సిందే. మూడేళ్ల కింద‌ట వ‌చ్చిన రాజా ది గ్రేట్ మాస్ రాజా చివ‌రి హిట్. దానికి ముందు, త‌ర్వాత డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. చివ‌ర‌గా చేసిన నాలుగు సినిమాలు ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, డిస్కో రాజా ఒక‌దాన్ని మించి ఒక‌టి నిరాశ పరిచాయి. నిర్మాత‌ల‌కు దారుణ‌మైన న‌ష్టాలు మిగిల్చాయి.

ఇలాంటి డిజాస్ట‌ర్ స్ట్రీక్ త‌ర్వాత వ‌చ్చే సినిమాపై ప్ర‌తికూల ప్ర‌భావం క‌చ్చితంగా ప‌డాలి. సినిమాకు పెద్ద‌గా బ‌జ్ ఉండ‌కూడ‌దు. బిజినెస్ క‌ష్టాలు కూడా ఎదుర‌వ్వాలి. కానీ మాస్ రాజా కొత్త సినిమా క్రాక్‌కు ఇలాంటి స‌మ‌స్య‌లేమీ లేన‌ట్లే క‌నిపిస్తోంది. ముందు నుంచి ఈ సినిమాపై ఒక పాజిటివిటీ క‌నిపిస్తోంది.

క్రాక్ అనే క్యాచీ టైటిల్ పెట్ట‌డానికి తోడు.. మాస్‌ను మురిపించే టీజ‌ర్ వ‌దిలి సినిమాపై అంచ‌నాలు పెంచాడు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని. ఆ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్లు, పాట‌లు, ఇత‌ర ప్రోమోలు అన్నీ కూడా పాజిటివిటీని పెంచుతూనే ఉన్నాయి. భూమ్ బ‌ద్ద‌ల్ అంటూ ఆ మ‌ధ్య త‌మ‌న్ రిలీజ్ చేసిన పాట ఒక ఊపు ఊపింది. ఇప్పుడు అనిరుధ్‌తో పాడించిన భ‌లేగున్నావే బాలా పాట కూడా మంచి ఊపుతో సాగి ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది.

సినిమా మాస్ రాజా స్ట‌యిల్లో ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా సాగుతుంద‌ని, మాస్‌కు గూస్ బంప్స్ గ్యారెంటీ అని అంటున్నారు. ర‌వితేజ‌, గోపీచంద్ క‌లిసి ఎలా ప్లాన్ చేశారో ఏమో కానీ.. ఇప్ప‌టికైతే వాళ్ల ప్ర‌ణాళిక‌లు బాగానే వ‌ర్క‌వుటైన‌ట్లున్నాయి. మాస్ రాజా గ‌త సినిమాల ప్ర‌భావం ఏమీ లేకుండా క్రాక్‌కు ఈజీగానే బిజినెస్ అయిపోయేలా ఉంది. థియేట‌ర్లు పూర్తి స్థాయిలో న‌డవ‌డం మొద‌ల‌య్యాక మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేస్తే, సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే.. మాస్ రాజా మ‌ళ్లీ గాడిలో ప‌డిపోయిన‌ట్లే.