‘ఆర్ఆర్ఆర్’ రాదంటే రాదు

RRR

ఇప్పటికే ఆరు నెలల పాటు వాయిదా పడింది ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా పక్కాగా రిలీజవుతుందని అంతా ఆశిస్తుండగా.. కరోనా వచ్చి బ్రేక్ వేసింది. నెలన్నరగా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో తెలియదు. లాక్ డౌన్ ఎత్తేసినా ఎన్నో ఆంక్షలుంటాయి.

ఇలాంటి భారీ చిత్రాన్ని తక్కువ మంది సిబ్బందితో షూట్ చేయడం అంత సులువు కాదు. ఇప్పుడు ఖాళీ సమయంలో కొంత మేర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసినా సరే.. మిగతా చిత్రీకరణ, తర్వాత నాలుగు భాషల్లో డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర వ్యవహారాల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడం అంటే సవాలే.

పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగి రేయింబవళ్లు శ్రమించి సినిమాను అనుకున్న సమయానికి విడుదలకు రెడీ చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ సినిమా సంక్రాంతికి రావడం అసాధ్యమే. అందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది.

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ను కూడా తన గత సినిమాకు దీటుగా మార్కెట్ చేయాలని, హైప్ తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఆయన ప్రమోషనల్ స్ట్రాటజీలు వేరుగా ఉంటాయి. విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే ప్రణాళిక అమలవుతుంది. ఐతే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఏడాది చివరికి కానీ థియేటర్లు తెరుచుకునేలా లేవు.

ఐతే థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నప్పటికీ వెంటనే జనాలు సినిమాలకు వెళ్లిపోరు. కొన్ని వారాలు.. నెలల పాటు టెస్టింగ్ టైం నడుస్తుంది. మళ్లీ మునుపటి రోజుల్లో మాదిరి జనాలు థియేటర్లకు రావడం అంత సులువు కాదు. ఈ టెస్టింగ్ టైంలో ఏ పెద్ద సినిమానూ విడుదల చేసే అవకాశం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమానైతే అస్సలు రిలీజ్ చేయరు.

దీని రీచ్, రెవెన్యూ వేరే స్థాయిలో ఉంటాయి. ఇంకా కుదురుకోని, సాధారణ పరిస్థితులు రాని సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసి రెవెన్యూను దెబ్బ తీసుకోరు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 8న రావడం అసాధ్యం. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక ఓ ఆరు నెలలైనా ఎదురు చూసి అటు ఇటుగా వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశముంది.