జ‌గ‌న్‌కు పొంచి ఉన్న మిత్రుడి ముప్పు!

రాజ‌కీయాల్లో నిన్న‌టి మిత్రుడు రేప‌టికి శ‌త్రువు కావొచ్చు. లేదా ఈరోజు శ‌త్రువు.. రేప‌టికి మిత్రుడూ కావొ చ్చు. ఏ నిముషానికి ఏమి జ‌రుగుతుందో.. రాజ‌కీయాల్లో ఏ ఒక్క‌రూ చెప్పే ప‌రిస్థితి లేదు. అధికారం.. ప‌రమావ‌ధి.. అవ‌కాశం ప్ర‌తి ఒక్కరి అవ‌కాశం! ఈ ప‌రిస్థితే.. ఏపీఅధికార పార్టీలోనూ గుబులు రేపుతోంది. బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. అస‌లు ఏపీతో సంబంధం లేని ఈ ఎన్నిక‌ల‌పై ఇక్క‌డ ఏపీలో వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుండ‌డం.. అంత‌ర్మ‌థ‌నం చెందుతుండ‌డం తెలిసిందే.

అయితే, ఇది కేవలం బీజేపీ విష‌యంలోనే కాదు. మ‌రోవైపు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మిత్రుడుగా ఉన్న.. మ‌రో పార్టీ అధినేత కూడా ఏపీపై క‌న్నేస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఆయ‌నే మ‌జ్లిస్ పార్టీ అధినేత‌, ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ. హైద‌రాబాద్ వేదిక‌గా రాజ‌కీయాలు చేస్తున్న ఎంఐఎం..బీజేపీ ల‌క్ష్యంగా ఉత్త‌రాది రాష్ట్రాల‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వ‌ర్గాల ను త‌న‌వైపు తిప్పుకొని కీల‌క స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది.

బిహార్‌లో ఐదు చోట్ల విజ‌యం సాధించింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ కేంద్రంగా ఉత్త‌రాదిలో పోటీ చేసిన ఎంఐఎం.. ఇప్పుడు సొంతంగా ఎందుకు దూకుడు చూపించ‌కూడ‌ద‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీపైనా దృష్టి పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని ఎంఐఎం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీలో నిజానికి ముస్లిం మైనార్టీ వ‌ర్గాల‌కు రాజ‌కీయ శూన్య‌త అయితే ఉంది. త‌మ‌ను పార్టీలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. త‌మ‌కంటూ ప్రత్యేక వేదిక లేద‌ని మైనార్టీ ముస్లిం వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

గ‌తంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా.. ఎలాంటి గుర్తింపున‌కు నోచుకోలేద‌ని మైనారిటీ వ‌ర్గాల్లో ఆవేద‌న వుంది. ఇక‌, వైసీపీ స‌ర్కారులో మంత్రి అంజాద్‌బాషా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌నకు స్వ‌తంత్రం లేద‌ని.. నిర్ణ‌యాలు తీసుకోలేక పోతున్నార‌ని.. మైనారిటీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీంతో త‌మ‌కంటే.. ఒక ప్ర‌త్యేక వేదిక ఉంటే బాగుంటుంద‌నే ఆలోచ‌న ఎప్ప‌టి నుంచో చేస్తున్నాయి. ఇక‌, మైనారిటీ ముస్లింల‌కు దిక్సూచిగా ఉన్న ఎంఐఎం.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఏపీపై దృష్టి పెట్టింది. అయితే, జ‌గ‌న్‌తో ఉన్న స‌న్నిహిత సంబంధాలు, కేసీఆర్‌తో ఉన్న దోస్తీ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు అడ్డుప‌డ‌కుండా సంయ‌మ‌నం పాటించారు.

అయితే, ఇప్పుడు వ్యూహాన్ని మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. దోస్తీ.. దోస్తీనే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే అంటు న్నారు. త్వ‌రలోనే జ‌ర‌గ‌నున్న ఇత‌ర రాష్ట్రాల ఎన్నిక‌ల్లోనూ పోటీకి రెడీ అవుతున్న ఎంఐఎం.. ఏపీపైనా దృష్టి పెట్టింది. దాదాపు 15 నియోజ‌క‌వ‌ర్గాలు ముస్లిం మైనారిటీ బ‌లంగా ఉన్న స్థానాలు కావ‌డంతో అక్క‌డ పోటీ చేసే అవ‌కాశం మెండుగా ఉంది. ఇది జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ వెంట ఉన్న మైనార్టీ వ‌ర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇది ఎంఐఎంకు దోహ‌ద‌ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.