నేత‌లు మ‌రో రూట్ వెతుక్కోవాల్సిందే.. ఆ కార్డు ప‌నిచేయ‌దు!

రాజ‌కీయాల్లో సింప‌తీ పాలిటిక్స్‌కు ఉండే ప్రాధాన్యమే వేరు. నాయ‌కులు,పార్టీలు కూడా సింప‌తీతో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అనేక సంద‌ర్భాల్లో ఈ దేశంలో అవి రుజ‌వ‌య్యాయి కూడా! ఇందిర‌మ్మ హ‌త్య‌కు గురైన‌ప్పుడు.. దేశం మొత్తం రాజీవ్ బాట న‌డిచింది. ఆ త‌ర్వాత రాజీవ్‌గాంధీ హ‌త్య‌కు గురైన‌ప్పుడు కూడా దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు అండ‌గా నిలిచారు. భారీ స్థాయిలో గెలిపించారు. ఈ ప‌రిణామాలే కాదు.. అనేక రాష్ట్రాల్లో నాయ‌కులు చ‌నిపోతే.. ఆ కుటుంబంలో ఎవ‌రు నుంచున్నా.. ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపేవారు. ఇక‌, న‌మ్మి టికెట్ ఇచ్చిన పార్టీకి మోసం చేసిన సంద‌ర్భంలో.. అలాంటి నాయ‌కుల ‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెప్పారు.

దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణే.. ఏపీ ఎన్నిక‌లు. 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచి… త‌ర్వాత టీడీపీలోకి చేరిన వారిని గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. వారు ఎలాంటి వారైనా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు ఈ సింప‌తీ పాలిటిక్స్ యుగం పోయింద‌నే భావ‌న క‌నిపిస్తోంది. వినిపిస్తోంది. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. బిహార్ అసెంబ్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌లు. బిహార్‌లో ఇటీవ‌లే.. ఎస్సీ నాయ‌కుడు. ద‌ళిత వ‌ర్గాల ఆశాజ్యోతి.. రాం విలాస్ పాశ‌వాన్ క‌న్నుమూశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న కుమారుడు చిరాగ్ ఈ విష‌యాన్ని అనేక సంద‌ర్భాల్లోను, స‌భ‌ల్లోనూ లేవ‌నెత్తాడు.

త‌న తండ్రి మ‌ర‌ణంతో ఏర్ప‌డిన సింప‌తీని త‌న‌కు ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాల్లో చిరాగ్ పార్టీ కేవ‌లం ఒకే ఒక్క స్థానానికి ప‌రిమిత‌మైంది. పోనీ.. ఆది నుంచి ఏమైనా లీడ్‌లో ఉందా అంటే అదికూడా క‌నిపించ‌లేదు. అంటే.. పాశ‌వాన్ మృతి ఘ‌ట‌న తాలూకు సింప‌తీ ఇక్క‌డ ఓట్ల‌రూపంలోకి మార‌లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇక‌, తెలంగాణ ఉప పోరులోనూ ఇదే సీన్ క‌నిపించింది. ఇక్క‌డ మ‌ర‌ణించిన సోలిపేట రామలింగారెడ్డిపై ఉన్న సానుభూతి ఓట్లు మారి ఉంటే.. ఆయ‌న స‌తీమ‌ణి సుజాత .. ల‌క్ష ఓట్ల మెజారిటీతో దూసుకుపోయి ఉండేవారు. కానీ, ఇక్క‌డ సానుభూతి ప‌నిచేయ‌లేదు.

ఇక‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉప ఎన్నిక విష‌యానికి వ‌ద్దాం. ఇక్క‌డో చిత్ర‌మైన ప‌రిస్థితి. కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్న స‌ర్కారునుంచి విడిపోయి.. బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికిన 28 మంది త‌ర్వాత ప‌రిణామాల‌తో రాజీనామా చేయ‌గా.. వ‌చ్చిన ఉప ఎన్నిక‌లు ఇక్క‌డ జ‌రిగాయి. ఈ పోరులో ఆ 28 మందికే బీజేపీ టికెట్లు ఇచ్చింది. అంటే.. కొన్నాళ్ల కింద‌ట కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి.. ఆ పార్టీని వ‌దిలి బీజేపీతో అంట‌కాగిన వారే బ‌రిలో నిలిచారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించింది. మాకు వెన్నుపోటు పొడిచి, ప్ర‌భుత్వాన్ని కూల‌దోసిన వారికి త‌గిన బుద్ధి చెప్పాలంటూ.. రాహుల్ పిలుపునిచ్చారు.

కానీ.. అనూహ్యంగా ప్ర‌జ‌లు వారికే మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ క్ర‌మంలో 20 మంది బీజేపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. సో.. ఇక్క‌డ కూడా ప్ర‌జ‌లు సింప‌తీని వ‌దిలేశార‌నే చెప్పుకోవాలి. ఇక‌, ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాబోయే రోజుల్లో.. నేత‌లకు మ‌రోమార్గం త‌ప్ప‌.. సింప‌తీతో స‌క్సెస్ అయ్యే ప‌రిస్థితులు లేవ‌నే సంకేతాలు స్ప‌ష్టంగా వ‌చ్చేశాయి.