ఓటీటీ రిలీజ్.. వంద కోట్లు పోయినట్లే

కరోనా కాలంలో వచ్చిందే పుణ్యం అన్నట్లుగా కొత్త సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసేస్తున్నారు నిర్మాతలు. థియేటర్లలో రిలీజ్ చేసి.. ఆ తర్వాత డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులు అమ్మితే నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయి. కానీ కరోనా వల్ల ఏడు నెలలకు పైగా థియేటర్లు మూత పడి ఉంటడటంతో మరో ప్రత్యామ్నాయం లేక కొత్త సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లోనే నేరుగా రిలీజ్ చేసేస్తున్నారు.

ఐతే కొన్ని చెత్త సినిమాలు ఓటీటీల్లోకి రావడం వల్ల వాటి నిర్మాతలు సేఫ్ అయిపోయారు. ఆ చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే తొలి రోజు సాయంత్రానికి థియేటర్లు వెలవెలబోయేవి. డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోయేవాళ్లు. ఆ రకంగా చూస్తే ఇలాంటి సినిమాలను వదిలించుకుని నిర్మాతలు బయటపడ్డట్లే. కానీ అన్ని సినిమాలకూ ఇలా ఉండదు.

సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ మరణానంతరం రిలీజైన అతడి చివరి సినిమా థియేటర్లలో రిలీజై ఉంటే భారీ వసూళ్లే వచ్చేవన్నది స్పష్టం. ఇప్పుడు దీపావళి కానుకగా హాట్ స్టార్‌లో రిలీజ్ కాబోతున్న ‘లక్ష్మి’ (ఒరిజినల్ టైటిల్ లక్ష్మీబాంబ్. వివాదం వల్ల మార్చారు) చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తే మోత మోగిపోయేదన్నది ట్రేడ్ పండిట్ల మాట. ఇది సౌత్ ‌బ్లాక్‌బస్టర్ ‘కాంఛన’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అది పలు భాషల్లో భారీ విజయం సాధించింది. హిందీలో కూడా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశముంది. దీని ట్రైలర్.. పాటలు అన్నింటికీ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అక్షయ్ సినిమా అంటే టాక్‌తో సంబంధం లేకుండా వంద కోట్ల వసూళ్లు వస్తాయి. పైగా ఈ చిత్రానికి లక్కీ గర్ల్ కియారా అద్వానీ పెద్ద ప్లస్. ప్రూవ్డ్ సబ్జెక్ట్, పైగా మాస్‌ను టార్గెట్ చేసిన సినిమా. ఈ తరహా చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ భారీగా వచ్చేవి. ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చే అవకాశముంది కాబట్టి మంచి సీజన్ చూసి రిలీజ్ చేస్తే రూ.200 కోట్లు అలవోకగా కొట్టేసేదని.. ఓటీటీలో రిలీజ్ చేయడం ద్వారా అటు ఇటుగా వంద కోట్ల దాకా ఆదాయానికి గండి పడ్డట్లే అన్నది ట్రేడ్ వర్గాల మాట. ఈ నెల 9న హాట్ స్టార్‌లో ‘లక్ష్మి’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.