పోలవరం బకాయిలు రూ. 2234 కోట్ల విడుదలకు ఓకే చెప్పిన కేంద్రం

వివాదాలతో హోరెత్తిపోతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం బకాయిలు రూ. 2234 కోట్ల విడుదలకు ఎటువంటి అభ్యంతరాలు లేవని కేంద్రం ఆర్ధికశాఖ స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు బకాయిల మొత్తాన్ని విడుదల చేయలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులకు ఆర్ధికశాఖ మెమో పంపింది. దీంతో మరో రెండు మూడు రోజుల్లో బకాయిలు విడుదలయ్యే అవకాశాలున్నట్లు రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. బకాయిల విడుదల చేయాలంటూ ఈమధ్యనే రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3805 కోట్లను ఖర్చు చేసింది. ఖర్చు చేసిన మొత్తాన్ని వెంటనే రీ ఎంబర్స్ చేయాలంటు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇదే సమయంలో రూ. 3805 కోట్లు ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) కూడా కేంద్ర ఆర్ధికశాఖకు ఓ నివేదిక పంపింది. దాంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే రూ. 3805 కోట్లను కాకుండా రూ. 2234 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్ధికశాఖ డిసైడ్ చేసింది.

పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల విషయంలో కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య వివాదం మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 47,615 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి శాఖకు పంపగా శాఖ ఉన్నతాధికారులు ఓకే చెప్పారు. అయితే నాలుగు రోజుల క్రితం కేంద్రం ఆర్ధికశాఖ నుండి ఓ సమాచారం వచ్చింది. అదేమిటంటే 2014 అంచనాల ప్రకారమే కేంద్ర ఆర్ధికశాఖ నిధులు విడుదల చేస్తుందట. 2014 అంచనాలంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే రూ. 20 వేల కోట్లను మాత్రమే ఇస్తామని స్పష్టంగా చెప్పింది.

నిజానికి ప్రాజెక్టు కాస్టంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు+భూసేకరణ ఖర్చు+నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం+పునరావాస ఖర్చులు కలిపి లెక్కేస్తారు. కానీ కేంద్రమేమో తాజాగా విచిత్రంగా కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తానంటోంది. మరి భూసేకరణ, నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, పునరావాస ఖర్చులు ఎవరు భరించాలి ? ఇక్కడే రాష్ట్ర-కేంద్రం మధ్య వివాదం మొదలైంది. మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో తెలీదు. ఈ నేపధ్యంలోనే ఇప్పటివరకు అయిన ప్రాజెక్టు ఖర్చులు రూ. 2234 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ అవ్వటం శుభపరిణామమనే చెప్పాలి.