ది బెస్ట్ జేమ్స్ బాండ్.. ఇక లేరు

బాండ్.. జేమ్స్ బాండ్.. మాట‌లు వింటే చాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రియుల రోమాలు నిక్క‌బొడుచుకుంటాయి. దాదాపు ఆరు ద‌శాబ్దాలుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగాసినీ ప్రియుల్ని అల‌రిస్తున్న ఘ‌న‌త జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాల‌దే. ఇప్ప‌టిదాకా చాలామంది బాండ్ పాత్ర‌ల్లో న‌టించారు కానీ.. అంద‌రిలోకి తొలి బాండే ది బెస్ట్ అన్న‌ది నిపుణుల మాట‌.

1962లో జేమ్స్ బాండ్ సిరీస్ తొలి సినిమాలో బాండ్ పాత్ర‌లో న‌టించి.. ఆ త‌ర్వాత మ‌రో ఆరు బాండ్ సినిమాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఉర్రూత‌లూగించిన న‌టుడు సీన్ కాన‌రీ. ఆ దిగ్గ‌జ న‌టుడు శ‌నివారం తుది శ్వాస విడిచాడు. ఆయ‌న వ‌య‌సు 90 సంవ‌త్స‌రాలు. ఈ ఆగ‌స్టులోనే త‌న 90వ పుట్టిన రోజు జ‌రుపుకున్న సీన్ కాన‌రీ.. అనారోగ్యంతో మృతిచెందిన‌ట్లు కుటుంబం వెల్ల‌డించింది.

బాండ్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవాళ్లు ఏ త‌రం వారైనా స‌రే.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి సీన్ కాన‌రీ బాండ్‌గా క‌నిపించిన సినిమాలు చూస్తే ఆయ‌నే ది బెస్ట్ బాండ్ అని ఒప్పుకుంటారు. 1962లో డాక్ట‌ర్ నో తో ఆయ‌న బాండ్ అవ‌తారం ఎత్తారు. 1983లో చివ‌ర‌గా నెవ‌ర్ సే నెవ‌ర్ అగైన్‌లో బాండ్‌గా క‌నిపించారు.

బాండ్ పాత్ర‌లు విడిచిపెట్టాక న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల మీద దృష్టిపెట్టిన కాన‌రీ.. 1988లో ది అన్‌ట‌చ‌బుల్స్‌లో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. ఆ త‌ర్వాత మ‌రెన్నో అద్భుత‌మైన సినిమాల్లో గొప్ప పాత్ర‌లు పోషించారు. మ‌రిన్ని పుర‌స్కారాలు కూడా అందుకున్నారు. 2000 వ‌ర‌కు ఆయ‌న సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. కాన‌రీ మృతితో బాండ్ సినిమా ప్రియులు విషాదంలో మునిగిపోయి.. ఆయ‌న జ్ఞాప‌కాల్ని నెమ‌రు వేసుకుంటున్నారు.