అమేజాన్‌లోకి అల్లరోడు

అల్లరి నరేష్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన సినిమాగా ‘నాంది’ని చెప్పుకోవచ్చు. ఏడెనిమిదేళ్లుగా హిట్ రుచి ఎరగని అతను.. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎప్పుడూ కామెడీ సినిమాలే చేసే అతను.. ఈసారి రూటు మార్చి పూర్తి సీరియస్ టైపులో ‘నాంది’ సినిమా చేశాడు. చేయని నేరానికి జైలుకు వెళ్లిన ఓ కుర్రాడు.. అక్కడి నుంచి బయటపడటం కోసం చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొన్ని నెలల కిందట విడుదలైన ‘నాంది’ టీజర్ ఇంటెన్స్‌గా ఉండి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ముఖ్య సన్నివేశాల కోసం నరేష్ నగ్నంగా కనిపించడం గమనార్హం. టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా పరిస్థితులు బాగుంటే థియేటర్లలోనే రిలీజయ్యేది. కానీ అలా లేని నేపథ్యంలో ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయినట్లు సమాచారం.

అమేజాన్ ప్రైమ్‌లో ‘నాంది’ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. డిసెంబర్లో విడుదల ఉండొచ్చని సమాచారం. తెలుగులో ‘వి’, ‘నిశ్శబ్దం’ లాంటి పెద్ద సినిమాలను భారీ రేటుకు కొని.. అవి ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో దెబ్బ తిన్న ప్రైమ్.. ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాల మీద దృష్టిపెట్టింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిన్న సినిమాను నవంబర్లో ఆ సంస్థ రిలీజ్ చేయబోతోంది. దాని తర్వాత దాన్నుంచి రాబోయే చిత్రాల్లో ‘నాంది’ ఒకటని తెలిసింది.

‘సుడిగాడు’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నరేష్.. ఆ తర్వాత రెండంకెల సంఖ్యలో సినిమాలు చేయగా.. ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రత్యేక పాత్రలో నటించిన ‘మహర్షి’ ఒకటి బాగా ఆడింది. చివరగా అతను ‘సిల్లీ ఫెలోస్’ అనే కామెడీ సినిమాతో పలకరించాడు.