బన్నీ, సునీల్‌ల కోసం రాజ్ తరుణ్ కథలు

రాజ్ తరుణ్ ఏంటి… బన్నీ, సునీల్‌ల కోసం కథలు రాయడమేంటి అనిపిస్తోందా? ఈ కుర్రాడు హీరో కావడానికి ముందు దర్శకత్వ శాఖలో పని చేసిన సంగతి తెలిసిందే. అసలతను ఇండస్ట్రీకి వచ్చిందే దర్శకుడు కావాలని. తను హీరోగా పరిచయమైన ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు కూడా ముందు దర్శకత్వ శాఖలోనే పని చేశాడు. ఐతే ఈ సినిమాకు ఎంతకీ హీరో సెట్ కాకపోవడంతో.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఊంటూ ఆడిషన్స్ చేస్తూ, ఆ పాత్ర మీద మంచి పట్టు సాధించిన రాజ్‌నే హీరోగా పెట్టి సినిమా తీసేశారు మేకర్స్.

ఆ సినిమా హిట్టవడం.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ కూడా సూపర్ హిట్లవడంతో రాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. హీరోగా స్థిరపడిపోయాడు. ఐతే ఇప్పుడు అతడి యాక్టింగ్ కెరీర్ ఏమంత బాగా లేదు. కాగా తాను ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా దర్శకుడిని అవుతానని ధీమాగా చెబుతున్నాడు రాజ్.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. దర్శకత్వ కలను నెరవేర్చుకోవడానికి ఎప్పట్నుంచో కథలు కూడా రాస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతానికి అల్లు అర్జున్, సునీల్‌లను దృష్టిలో ఉంచుకుని రెండు కథలు రాసినట్లు తెలిపాడు. ఏ కథ రాసినా ముందే ఎవరో ఒక హీరోను దృష్టిలో ఉంచుకునే రాస్తామని.. తాను రాస్తున్న కథలకు బన్నీ, సునీల్‌లను దృష్టిలో ఉంచుకున్నానని చెప్పాడు రాజ్. ఐతే వాళ్లతో సినిమాలు చేస్తానో లేదో చెప్పలేనని అన్నాడు. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో వదులుకున్న మంచి అవకాశాల గురించి చెబుతూ.. ‘శతమానం భవతి’ సినిమాకు డేట్లు కేటాయించలేకే దాన్ని చేజార్చుకున్నట్లు చెప్పాడు.

అప్పటికి తాను మూడు సినిమాల్లో నటిస్తున్నానని.. ఆ సమయంలో దిల్ రాజు ఆ సినిమా కోసం అడిగారని.. ఐతే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడం కోసం త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనడంతో ఆ సినిమా వదులుకున్నానని చెప్పాడు. ‘ట్యాక్సీవాలా’ కథ నచ్చినప్పటికీ.. హార్రర్ జానర్ అంటే ఏదోలా అనిపించి ఆ సినిమా చేయలేదన్నాడు. అందరూ అనుకుంటున్నట్లు ‘గీత గోవిందం’ ఆఫర్ తనకు రాలేదని చెప్పాడు. ఇవి కాక వేరే మంచి సినిమాలేవీ వదులుకోలేదని చెప్పాడు.