రాఘవేంద్రుడి కొత్త సినిమా

తెలుగు సినిమా చరిత్రలో రాఘవేంద్రరావుది ఒక ప్రత్యేక అధ్యాయం. దాదాపు మూడు దశాబ్దాల పాటు నిర్విరామంగా సినిమాలు తీశారాయన. గత రెండు దశాబ్దాల్లోనే జోరు తగ్గుతూ వచ్చింది. శతాధిక చిత్రాల దర్శకుడైన రాఘవేంద్రరావు.. గత మూడేళ్లుగానే ఖాళీగా ఉంటున్నారు. చివరగా 2017లో ఆయన్నుంచి ‘ఓం నమో వేంకటేశాయ’ వచ్చింది. ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రాఘవేంద్రరావుకు తీవ్ర నిరాశే మిగిలింది.

మరో ‘అన్నమయ్య’ అవుతుందనుకున్న సినిమా కాస్తా.. ‘పాండురంగడు’, ‘షిరిడి సాయి’ల కన్నా ఘోరమైన ఫలితాన్నందుకుంది. ఈ దెబ్బతో మెగా ఫోన్ పక్కన పెట్టేశారు దర్శకేంద్రుడు. ఇక ఆయన దర్శకత్వంలో సినిమా రావడం సందేహమే. ఐతే రాఘవేంద్రరావు నిర్మాతగా మాత్రం కొనసాగాలని అనుకుంటున్నట్లు ముందే సంకేతాలు ఇచ్చాడు.

ఒక వైవిధ్యమైన ప్రాజెక్టు కోసం ఆయన ఏడాదిగా సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ సినిమాను ప్రారంభించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ సినిమా గురించి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు వెల్లడించనున్నట్లు రాఘవేంద్రరావు ప్రకటించారు. సన్నిహితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ చిన్న వీడియో కూడా వదిలారు రాఘవేంద్రరావు.

నాగశౌర్యతో పాటు మరికొందరు పేరున్న నటీనటుల్ని పెట్టి క్రిష్, ఇంకో ఒకరిద్దరు దర్శకులతో ఒక మల్టీ స్టోరీ సినిమాను రూపొందించాలని రాఘవేంద్రరావు ఇంతకుముందు అనుకున్నారు. దీని గురించి ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. మరి ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేయబోయేది ఆ ప్రాజెక్టునేనా.. లేక ఇంకోటా అన్నది తెలియడం లేదు. ఏదైనా సరే.. నిర్మాతగా అయినా దర్శకేంద్రుడు మళ్లీ యాక్టివ్ అయి సినిమా చేస్తున్నారంటే అభిమానులకు సంతోషమే.