ప్ర‌భాస్ నిజంగా డైనోస‌రే..

గ‌త ప‌దేళ్ల‌లో ఇండియ‌న్ సినిమా ప‌రిధి గ్లోబ‌ల్ స్థాయిలో పెరుగుతూ పోతున్న నేప‌థ్యంలో విదేశాల్లో కూడా మ‌న చిత్రాలు పెద్ద ఎత్తున రిలీజ‌వుతున్నాయి. ముఖ్యంగా ఫారిన్లో మ‌న‌కు అతి పెద్ద మార్కెట్ ఉన్న ఉత్త‌ర అమెరికాలో ఒక‌ప్పుడు వంద లొకేష‌న్ల‌లో సినిమాను రిలీజ్ చేయ‌డం కూడా గొప్ప‌గా చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడ‌క్క‌డ 500 లొకేష‌న్ల‌లో మ‌న చిత్రాలు రిలీజ‌వుతున్నాయి.

బాహుబ‌లి-2, ఆర్ఆర్ఆర్, ప‌ఠాన్ లాంటి సినిమాలు వెయ్యికి పైగా స్క్రీన్ల‌లో రిలీజవ‌డంతో హాలీవుడ్ సినిమాల స్థాయిలో సంద‌డి క‌నిపించింది.

ఐతే ఇప్ప‌టిదాకా రిలీజ్ ప‌రంగా ఉన్న రికార్డుల‌న్నింటినీ కూడా ప్ర‌భాస్ కొత్త చిత్రం స‌లార్ కొట్టేయ‌బోతోంది. ఈ సినిమాను ఏకంగా 1979+ స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగానే ప్ర‌క‌టించ‌డం విశేషం.
ప్ర‌త్యంగిర సినిమాస్ స‌లార్ సినిమా ఉత్త‌ర అమెరికా హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. ఆ సంస్థ ఏకంగా 1979+ స్క్రీన్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అఫీషియ‌ల్ స్టేట్మెంట్ ఇచ్చింది.

ఇండియ‌న్ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఎవ‌ర్ రిలీజ్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌త రికార్డు కంటే 400-500 దాకా స్క్రీన్లు ఎక్కువే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. రిలీజ్‌కు రెండు నెల‌ల ముందే ఈ మేర‌కు కౌంట్ ఉందంటే.. రిలీజ్ టైంకి లెక్క ఇంకా పెర‌గొచ్చు కూడా. ఈ స్క్రీన్ కౌంట్ వింటే టీజ‌ర్లో వినిపించిన డైనోస‌ర్ డైలాగ్ క‌రెక్టే అనిపిస్తోంది.

ప్ర‌భాస్ గ‌త మూడు చిత్రాలు నిరాశ ప‌రిచినా స‌రే.. స‌లార్‌కు హైప్ మామూలుగా లేదు. ఇది అత‌డి క‌టౌట్‌కు, ఇమేజ్‌కు త‌గ్గ మాస్ బొమ్మ కావ‌డం.. పైగా కేజీఎఫ్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో స‌లార్ మీద అంచ‌నాలు తారా స్థాయిలో ఉన్నాయి. టీజ‌ర్ కొంత నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికీ అది సినిమా హైప్ మీద ఏమాత్రం ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌లేదు. సెప్టెంబ‌రు 28న స‌లార్ బాక్సాఫీస్ వేట‌కు దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే.