టీ సీరీస్ బంధమే డిజాస్టర్లకు కారణం

బాహుబలి తర్వాత ప్రభాస్ కు అతి పెద్ద ప్యాన్ ఇండియా మార్కెట్ ఏర్పడటం ఎంత తలలు పండిన విశ్లేషకుడైనా ఒప్పుకుని తీరే వాస్తవం. అయితే గత మూడు సినిమాల ఫలితాలు అభిమానులకే కాదు వాటి మీద ఆధారపడ్డ బయ్యర్లకు  తీవ్ర నష్టాలను మిగిల్చాయి. అయితే ఇక్కడ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ వీటిలో కీలక పాత్ర పోషించిందన్న నిజాన్ని విస్మరించకూడదు. సాహో తీసింది తెలుగు దర్శకుడే అయినా  కేవలం ఆ ప్రొడక్షన్ హౌస్ ప్రమేయం వల్లే మ్యూజిక్ డైరెక్టర్ తో మొదలుపెట్టి సపోర్టింగ్ క్యాస్ట్ దాకా ఎక్కువ హిందీ వాసనే వేసింది. యువి భాగస్వామ్యం ప్రేక్షకపాత్ర పోషించింది.

తర్వాత రాధే శ్యామ్ ది ఇదే స్టోరీ. రాధాకృష్ణ మనవాడే అయినా నిర్మాణానికి సంబందించిన ప్రతి వ్యవహారం టి సిరీస్ కనుసన్నల్లోనే సాగిందనేది బహిరంగ రహస్యం. సంగీతం ఎవరితో చేయించుకోవాలనే విపరీత జాప్యం జరిగింది దీని వల్లే. ఆఖరికి సౌత్ కి ఒకరు నార్త్ కు ఒకరిని తీసుకున్నారు. సాహోకి ఇదే సమస్య వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జిబ్రాన్ తో చేయించారు. ఇప్పుడు ఆదిపురుష్ విషయంలో సైతం ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప రామాయణం లాంటి కథని ఎంత గొప్పగా చెబుతున్నామనేది దశాబ్దాల చరిత్ర ఉన్న టి సిరీస్ చెక్ చేసుకోలేదు.

ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. స్పిరిట్ కూడా టి సిరీస్ దే. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కాబట్టి వ్యవహారం అంత ఆషామాషీగా ఉండకపోవచ్చు కానీ అసలు తెలుగు ఫ్లేవర్ లేకుండా తనతో సినిమాలు తీస్తున్న ఈ బ్యానర్ ధోరణి పట్ల ప్రభాస్ కొంత సీరియస్ గా ఆలోచించడం అవసరం. బాహుబలికి రాజమౌళి ఎలాంటి గిమ్మిక్కులు చేయలేదు. లోకల్ కంటెంట్ తో గ్లోబల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. కానీ టి సిరీస్ మాత్రం ఎన్ని వందల కోట్లను ప్రభాస్ మీద వర్కౌట్ చేసుకోవచ్చనే పోకడ తప్ప స్క్రిప్ట్ ల మీద సరైన కసరత్తు చేయిస్తున్న దాఖలాలు లేవు. సమస్యలకు ఇదే మూలమంటే కాదనగలమా