ప్రధాని అభ్యర్ధిగా నితీష్ పోస్టర్లు కలకలం

రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్ధిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పోస్టర్లు వెలిశాయి. పార్టీ ఆఫీసు పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని మరికొన్ని చోట్ల ప్రధానమంత్రి అభ్యర్ధిగా నితీష్ అని పెద్ద పోస్టర్లు వెలిశాయి. దాంతో బీహార్లో ఒక్కసారిగా సంచలనం మొదలైపోయింది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేని ఓడించటమే ధ్యేయంగా చాలామంది అనేక ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్టుగా నితీష్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు శరద్ పవార్ లాంటి వాళ్ళని కూడా నితీష్ కలిశారు. తొందరలోనే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తో కూడా భేటీ జరపబోతున్నారు. నితీష్ ఒక ఫార్ములాను పట్టుకొచ్చారు. అదేమిటంటే ఎన్డీయే అభ్యర్ధులకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల తరపున ఒకే అభ్యర్ధిని పోటీలోకి దింపాలని. అంటే ఎన్డీయే అభ్యర్ధులకు, ప్రతిపక్షాల తరపున పోటీచేసే అభ్యర్ధికి వీలైనంతలో ముఖాముఖి పోటీ జరగాలన్నది నితీష్ ఉద్దేశ్యం.

ముఖాముఖి పోటీ జరిగినపుడు మాత్రమే ఎన్డీయే లేదా బీజేపీ అభ్యర్ధులను ఓడించటం సాధ్యమవుతుందన్నది నితీష్ ఆలోచన. ఆలోచన కాగితాలపైన, వినటానికి బాగానే ఉంటుంది కానీ ఆచరణలో అంత తేలిగ్గా సాధ్యంకాదు. పదవులను త్యాగాలు చేయటానికి సిద్ధంగా ఉన్నపుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. అయితే పదవులను త్యాగాలు చేయటానికి సిద్ధంగా ఎవరుంటారు ? ప్రధాని అభ్యర్ధిగా ఉండాలనే విషయంలో మమత, కేసీయార్, శరద్ పవార్ లాంటి వాళ్ళమధ్యే తీవ్రమైన పోటీ ఉంది.

సరిగ్గా ఈ సమయంలోనే నితీష్ పేరుతో ప్రధానమంత్రి అభ్యర్ధంటు పోస్టర్లు వెలిశాయి. దీంతో ప్రతిపక్షాల ఐక్యతకు నితీష్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పోస్టర్లు ఎవరంటించారనే విషయంలో క్లారిటి లేకపోయినా గోలైతే మొదలైపోయింది. పైగా ఈ పోస్టర్ ను రాష్ట్రీయ జనతాదళ్ ప్రదర్శించింది. తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని నితీష్ ఎంతగా ప్రకటించినా ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే ప్రధాని పదవి వస్తుందంటే ఎవరైనా కాలదన్నుకుంటారా ?