ఇండియా లో ఆస్కార్ లైవ్ టైం ఏప్పుడో తెలుసా?

నెలల తరబడి జరుగుతున్న సుదీర్ఘ నిరీక్షణ చివరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఆస్కార్ సంరంభం మొదలుకాబోతోంది. అందరి కళ్ళు అఫీషియల్ నామినేషన్ దక్కించుకున్న నాటు నాటు పాట మీదే ఉన్నాయి. తీవ్రమైన పోటీ ఉన్నా సరే అమెరికా మీడియా అంచనాల ప్రకారం రాజమౌళి బృందమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. వస్తే అంతకన్నా సంతోషం ఉండదు కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు రాకపోయినా బాధపడేందుకు ఏమి లేదు. ఎందుకంటే టాలీవుడ్ ఖ్యాతిని జక్కన్న ఇప్పటికే ఖండాంతరాలు దాటించేసి సగర్వంగా జెండా పాతాడు.

ఇండియా అభిమానులు ఈ వేడుకను ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి లైవ్ లో చూడొచ్చు. డిస్నీ హాట్ స్టార్ యాప్ తో పాటు ఈ నెట్ వర్క్ కు సంబంధించిన అన్ని బాషల జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ శాటిలైట్ ఛానల్స్ లో అందుబాటులో ఉంటుంది. నాటు నాటుకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు ఉండొచ్చనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. మన ఇండస్ట్రీ సెలబ్రిటీలు మాత్రం వస్తే ఎలా రాకపోతే ఎలా అని ముందస్తుగానే ట్వీట్లు రెడీ చేసుకున్నారని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. గర్వపడే క్షణాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారు.

మరోవైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణిలు ఎడతెరిపి లేకుండా అక్కడి కార్యక్రమాల్లో యమా బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ మీట్, యుఎస్ మీడియా ఇంటర్వ్యూలు, సెలబ్రిటీ టాక్ షోలు, పార్టీలు ఒకటేమిటి లేవడంతో మొదలు పడుకునే దాకా షెడ్యూల్ యమా బిజీగా ఉంది. నాటు నాటుకి ఇద్దరూ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్స్ దాదాపు జీరోనే. కనీస ప్రాక్టీస్ కి టైం లేకపోవడంతో కేవలం స్టేజి మీద కీరవాణి రాహుల్ కాలభైరవలు పాడటంతో సరిపెట్టుకోవాలి. ఏదైనా చిన్న స్టెప్పుకు తారక్ చరణ్ లు కాలు కదపొచ్చేమో. చూడాలి మరి స్వప్నం ఎలా నెరవేరబోతోందో