గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ దాడి!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ క‌క్ష‌లు శ్రుతి మించాయి. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విరుచుకుప‌డ్డారు. చేతికి అందిన రాళ్ల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ కార్యాల‌యానికి ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఇంత‌టితో కూడా ఊరుకోని కార్య‌క‌ర్త‌లు.. కార్యాల‌యంలో పార్కింగ్ చేసిన రెండు కార్లు, నాలుగు బైకుల‌కు కూడా నిప్పు పెట్టారు. అదేస‌మ‌యంలో కార్యాల‌యంలో ఎవ‌రైనా ఉన్నారేమో.. అనిలోప‌ల‌కు చొచ్చుకు వెళ్తే ప్ర‌య‌త్నం చేయ‌డం.. ఇంత‌లోనే టీడీపీ కార్య‌కర్త‌లు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకోవ‌డంతో మ‌రింత ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అస‌లు ఏం జ‌రిగింది?

టీడీపీ నేత‌లు కొంద‌రిని ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బెదిరింపుల‌కు గురి చేస్తున్నార‌ని.. కొంద‌రు నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి కేసు న‌మోదు చేయ‌లేదు. అయితే.. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారానికి వ‌చ్చింది. దీంతో ఆగ్ర‌హోద‌గ్రులైన వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యే వంశీ అనుచ‌రులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాల‌యంపై దాడికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో వారికి అందివ‌చ్చిన వాటిని కార్యాల‌యంపై విసిరేశారు. అందేకాదు.. టీడీపీ నేత‌ల‌ను ప‌రుషంగా దూషిస్తూ.. ద‌మ్ముంటే బ‌య‌ట‌కు రండి అని స‌వాళ్లు రువ్వారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వంశీ.. త‌ర్వాత వైసీపీలోకి చేరిన విష‌యం తెలిసిందే. దీంతో ఇక్క‌డ ఇంచార్జ్‌గా టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడును పార్టీ నియ‌మించింది. అయితే, ఆయ‌న అనారోగ్యం కార‌ణంగా..కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో కింది స్థాయి నాయ‌కులే పార్టీ కార్య‌క్ర‌మాలు చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారిని వంశీ హెచ్చ‌రించార‌ని.. కార్య‌క‌ర్త‌లు పేర్కొంటున్నారు. పార్టీ కార్యాల‌యాన్ని శాశ్వ‌తంగా తొల‌గించాల‌ని కూడా హెచ్చ‌రించార‌ని పేర్కొన్నారు. దీంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కార‌ణంగానే వైసీపీ నాయ‌కులు.. టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసి.. వాహ‌నాల‌కు నిప్పు పెట్టార‌ని స‌మాచారం.