శ్రుతిహాసన్.. కూరలో కరివేపాకు

ఈసారి సంక్రాంతికి అరుదైన చిత్రం చోటు చేసుకుంది. ఈ పండక్కి రిలీజైన రెండు పెద్ద సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లను నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ కాగా.. ఆ రెండింట్లోనూ మెయిన్ హీరోయిన్ శ్రుతి హాసనే. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలకు జోడీగా ఆమె నటించింది.

ఒక దశలో కెరీర్ ముగిసిందనుకున్న శ్రుతి.. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ‘క్రాక్’తో ఫాంలోకి రావడం.. ఆ వెంటనే ఇలాంటి రెండు భారీ చిత్రాల్లో నటించడం.. అవి రెండూ ఒకేసారి సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రిలీజ్ కావడం విశేషమే.

ఈ సినిమాలతో శ్రుతి రేంజే మారిపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ రెండు చిత్రాల్లో శ్రుతిని చూసిన వాళ్లందరూ పెదవి విరుస్తున్నారు. ఈ రెండింట్లోనూ శ్రుతితి కూరలో కరివేపాకు టైపు పాత్రలే కావడమే అందుక్కారణం.

ముందుగా ‘వీరసింహారెడ్డి’లో శ్రుతి పాత్ర విషయానికి వస్తే.. ఆమె యంగ్ బాలయ్య సరసన నటించింది. ఈషా అనే అల్లరి అమ్మాయి పాత్రలో శ్రుతి ఏమాత్రం ప్రత్యేకత చాటుకోలేకపోయింది. యంగ్ బాలయ్య సరసన ఒక హీరోయిన్ని పెట్టాలంటే పెట్టాలి అన్నట్లు ఆమె పాత్రను డిజైన్ చేశారు.

సినిమాలో చాలా బోరింగ్‌గా అనిపించే సీన్లు శ్రుతితో ముడిపడ్డవే. శ్రుతి బాగానే అందాలు ఆరబోసినా.. పాత్ర పరంగా మాత్రం అందులో ఏ విశేషం లేదు. తొలి అరగంట తర్వాత శ్రుతి పాత్ర పూర్తిగా నామమాత్రం అయిపోతుంది. సెకండాఫ్‌లో ఒక పాట కోసం మాత్రమే ఆమె ఉంది. బాలయ్య పక్కన శ్రుతికి జోడీ కూడా సరిగా కుదరలేదు.

ఇక ‘వాల్తేరు వీరయ్య’ విషయానికి వస్తే.. ఆమె అండర్ కవర్ రా ఏజెంట్ పాత్ర చేసింది. రా ఏజెంట్ అంటే అబ్బో అనుకుంటాం కానీ.. తెర మీద ఈ పాత్రను కూడా చాలా సాధారణంగా చూపించారు. రా ఏజెంట్లు ఇలా కూడా ఉంటారా అని నవ్వుకునేలా ఆ పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు బాబీ.

ఈ సినిమాలో శ్రుతి లుక్ కూడా ఎందుకో సరిగా కుదరలేదు. చిరు పక్కన కూడా ఆమె కొంచెం ఆడ్‌గానే కనిపించింది. మొత్తంగా చూస్తే ఒకేసారి రిలీజైన రెండు భారీ చిత్రాల్లో కథానాయికగా నటించిన సంబరమేమో కానీ.. తెర మీద మాత్రం శ్రుతి పాత్రలు తేలిపోయాయి.