ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆ జనసేన నేత?

బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరు అవుతారనే అంశంపై కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ పార్టీలోకి ఏపీకి చెందిన కొందరి చేరికలు ఉంటాయన్న సంకేతాలు కనిపిస్తున్నా.. పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారనే విషయంలో రకరకాల సమీకరణలు వినిపించాయి.

ముఖ్యంగా ఇందులో కులాల లెక్కలూ కనిపించాయి. అయితే, ఏపీలో ఒక అధిక సంఖ్యాక వర్గాన్ని ఆకర్షించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఉందని… అందుకే ఆ వర్గం నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన జనసేనలో ఉండడంతో ఒకట్రెండు రోజుల్లో జనసేనకు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌లో చేరుతారని.. ఆ రోజున కానీ, అక్కడికి ఒకట్రెండు రోజుల్లో కానీ ఆయన్ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

ఇంతకీ జనసేన నుంచి బీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న ఆ నేత ఎవరో కాదు.. తోట చంద్రశేఖర్. తోట చంద్రశేఖర్ ప్రస్తుతం జనసేన పార్టీలో రాజకీయ వ్యవహారా కమిటీ సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక స్థానంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నారని… ఆయన వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది.

కాగా మాజీ ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్ గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన సుమారు 28 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తూ 2009లో సర్వీసులో ఉండగానే రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరఫున గుంటూరు లోక్ సభ స్థానంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత వైసీపీలో చేరిన ఆయన 2014లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అనంతరం 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరారు. అంతకుముందు 2018లో ఉండవల్లి అరుణ్ కుమార్, జయ ప్రకాశ్ నారాయణ్‌లతో పాటు ఆయన కూడా పవన్ నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్నారు. ఏపీకి కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలు సమగ్రంగా, కచ్చితంగా వివరిచండానికి పవన్ కల్యాణ్ ఈ కమిటీ ఏర్పాటు చేశారు.
అనంతరంలో జనసేనలో చేరిన తోట చంద్రశేఖర్ అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా పవన్‌తో సాన్నిహిత్యం ఉన్న ఆయన ఇప్పుడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులు కావడంపై జనసేన వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.