టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ వార్నింగ్‌!

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై నిఘా పెట్టిన‌ట్టు సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల ఫోన్ల‌ను కూడా వింటున్న‌ట్టు వెల్ల‌డించేశారు. నిజానికి ఇలా విన‌డం టెలీగ్రాఫ్ చ‌ట్టం ప్ర‌కారం చెల్ల‌దు. కానీ, సీఎం ఎందుకు ఇలా చెప్పారో తెలియ‌క‌.. నేత‌లు త‌ల‌ప‌ట్టుకున్నారు. ఇక‌, టీఆర్ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మ‌రిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, పార్టీ శ్రేణులంతా ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌ళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామ‌ని తెలిపారు. పార్టీ ఓడిపోవ‌డం అనేది ఉండ‌ద‌ని భ‌రోసా ఇచ్చారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట మాత్ర‌మే కొత్త‌వారికి అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఎన్నిక‌ల‌కు 10 నెల‌ల స‌మ‌యమే ఉంద‌న్నారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడోసారి కూడా మనదే గెలుపు కావాలని ఆకాంక్షించారు.

ఒత్తిడి తెస్తే.. చెప్పండి!

ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. బీజేపీ వాళ్లకు దర్యాప్తు సంస్థలు ఉంటే మనకు కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రసంస్థలో రాష్ట్ర సంస్థలో తేల్చుకుందామని అన్నారు. “పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నామనుకుంటే మీ పొరపాటు. మీ ఫోన్‌లపై నిఘా ఉంటుంది. పార్టీ మారాలని ఎవరైనా ఒత్తిడి తేస్తే నాకు సమాచారం ఇవ్వండి” అని సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు సూచించారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ‘ద‌ళిత బంధు’

పార్టీ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి నివేదిక రూపొందించుకోవాలని, మంత్రులు ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని కేసీఆర్‌ తెలిపారు. 100 ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్‌ను నియమించాలని, 5 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. పోడుభూముల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఇక నుంచి ధరణి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళితబంధు ఇస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.