ప్రభాస్ అభిమానులకు మంటెత్తించిన నెట్‌ఫ్లిక్స్

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటపుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సినిమా హీరోలు, క్రికెట్ స్టార్ల అభిమానులను బాధ పెట్టేలా ఏవైనా ట్విట్టర్ హ్యాండిల్స్ పోస్టులు వేశాయంటే జరిగే డ్యామేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే అనుభవాన్ని నెట్ ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది.

అసలే కొంత కాలంగా సబ్‌స్క్రిప్షన్లు తగ్గి, భారీగా ఆదాయం కోల్పోతూ ఇబ్బంది పడుతున్న ఆ సంస్థ.. ఉన్న నెగెటివిటీ చాలదని ప్రభాస్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చేలా ఒక పోస్టు పెట్టింది. ‘సాహో’ సినిమాలో ప్రభాస్ కొండ మీద నుంచి లోయలోకి దూకే షాట్‌ తాలూకు స్క్రీన్ షాట్ పెట్టి.. ఇదేం విన్యాసం అంటూ వ్యంగ్యంగా ఒక కామెంట్ పెట్టింది.

కాకపోతే ఈ పోస్టు పెట్టింది నెట్ ఫ్లిక్స్‌ ఇండొనేషియా విభాగం. ఇండొనేషియా భాషలోనే ఇంగ్లిష్ అక్షరాలతో ఆ పోస్టు పెట్టారు. దీనికి గూగుల్లో అర్థం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులకు మంటెత్తిపోయింది.

ఆ కామెంట్‌ వ్యంగ్యంగా ఉండడం, ‘సాహో’ సినిమాను, ప్రభాస్‌ను కించపరుస్తున్నట్లు అనిపించడంతో వారు నెట్ ఫ్లిక్స్‌ మీద యుద్ధం ప్రకటించేశారు. నిన్నట్నుంచి ‘అన్‌సబ్‌స్క్రైబ్ నెట్ ఫ్లిక్స్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకుంటున్న స్క్రీన్ షాట్లను వేలాది మంది పోస్ట్ చేశారు. ‘

సాహో’ ఎంతో కష్టపడి చేసిన సినిమా. యాక్షన్ పరంగా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను అది ఎంతగానో పెంచింది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఉండొచ్చు. ఇలాంటివి హాలీవుడ్ సినిమాల్లోనూ చూడొచ్చు. అలాంటపుడు ప్రభాస్ సినిమాను ఇలా టార్గెట్ చేయడం ఏంటి అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి యథాలాపంగా వేసిన ఒక ట్వీట్ వల్ల ‘నెట్ ఫ్లిక్స్’ జరుగుతున్న డ్యామేజీ చాలా పెద్దది అనే చెప్పాలి.