‘ఈనాడు’ ర్యాగింగ్ మామూలుగా లేదు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొంత కాలానికి ఆయనతో ఈనాడు పత్రిక యుద్ధం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను కూడా ఈనాడు గట్టిగానే టార్గెట్ చేసింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత, 2014 ఎన్నికలయ్యాక ఆ పత్రిక దూకుడు తగ్గిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ‘ఈనాడు’ మరీ సాత్వికంగా తయారవడం చాలా మందికి రుచించలేదు.

ఐతే గత కొన్ని నెలల్లో ‘ఈనాడు’ తీరే మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ తీరు శ్రుతి మించిపోవడం, అదే పనిగా తమను కూడా జగన్ అండ్ కో టార్గెట్ చేస్తుండడంతో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి ఈనాడు అధినేత రామోజీ రావు సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. మళ్లీ వైఎస్ రోజులను గుర్తుకు తెస్తూ ఆ పత్రిక జగన్ అండ్ గ్యాంగ్‌ను చాలా గట్టిగా టార్గెట్ చేస్తోంది ఈనాడు. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి వైకాపా అగ్ర నేత విజయసాయిరెడ్డితో ఈనాడు పోరు రసవత్తరంగా సాగుతోంది.

విజయసాయి కూతురు, అల్లుడు విశాఖపట్నంలో గత ఏడాదిగా భారీగా భూములు కొనడం గురించి మూడు రోజుల కిందట ఈనాడు పూర్తి ఆధారాలతో ప్రచురించిన కథనం సంచలనం రేపింది. రెండు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈనాడు మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విజయసాయి. కానీ ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పిన తీరు తుస్సుమనిపించింది. కాగా ఈ ప్రెస్ మీట్లో విజయసాయి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దసపల్లా భూముల డెవలప్మెంట్‌కు సంబంధించి తాను 71 శాతం వాటా తీసుకుని, యజమానులకు 29 శాతం మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబడుతున్న వారు.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కూర్మనపాలెంలో యజమానులకు 1 శాతం మాత్రమే వాటా ఇచ్చి, డెవలపర్ (ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ) 99 శాతం వాటా తీసుకోవడాన్ని ప్రశ్నించరేంటి అని విజయసాయి ప్రెస్ మీట్లో అడిగారు.

ఎంపీ మాటను పట్టుకునే ‘ఈనాడు’ ఈ వ్యవహారం మీద గురువారం మరో కథనం ప్రచురించింది. ఎంవీవీ వ్యవహారం మొత్తాన్ని బట్టబయలు చేసింది. అందులో ‘సాయిరెడ్డి సౌజన్యంతో’ అంటూ ఒక హెడ్డింగ్ పెట్టి ఒక బాక్స్ ఐటెం ఇచ్చింది. విజయసాయి ఇచ్చిన సమాచారంతోనే ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశామని.. విజయసాయి చెప్పినట్లు ఇందులో భూ యజమానుల వాటా 1 శాతం కూడా లేదని.. 0.96 శాతమే అంటూ ఎంతో వ్యంగ్యంగా ఎంవీవీ దందా గురించి విశ్లేషించింది ‘ఈనాడు’. ఈ కథనం చూసి ఈనాడు ర్యాగింగ్ మామూలుగా లేదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.