బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నదా ?

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కీలకమైన నిర్ణయం ఏమిటంటే సీనియర్లందరినీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయించాలనట. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు నలుగురు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను కూడా అసెంబ్లీ ఎన్నికల పోటీలోకి దింపాలని ఢిల్లీ నుండి ఆదేశాలు వచ్చాయట.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి బీజేపీకి గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గట్టి అభ్యర్ధులు లేకపోతే ఇక 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్ధులు ఎక్కడినుండి వస్తారు ? గట్టి అభ్యర్ధుల కొరతను భర్తీ చేసుకోవటానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని నేతలకు గాలమేస్తోంది. ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలామంది నేతల్లో కొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి వలసొచ్చిన వాళ్ళే.

ఇలాంటి వలస నేతలు కూడా లేకపోతే బీజేపీ పరిస్థితి గోవిందాయే. అందుకనే బయట పార్టీల నుండి నేతలను నమ్ముకుంటే కష్టమని సీనియర్లందరినీ పోటీలోకి దింపాలని అగ్రనేతలు డిసైడ్ అయ్యారట. ఇలాంటి మోడల్ నే మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ప్రయోగించి సక్సెస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో కూడా కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలతో పాటు సీనియర్లను పోటీ చేయించింది. వీరిలో కొందరు ఓడిపోగా మరికొందరు గెలిచారు.

సో అలాంటి ప్రయోగమే రేపు తెలంగాణాలో కూడా అమలు చేయాలని నిర్ణయించుకుందట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేములవాడ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ నుండి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు బోధన్ నుండి, కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపి కిషన్ రెడ్డి అంబర్ పేట అసెంబ్లీ నుండి పోటీచేయటానికి రెడీ అవుతున్నారట. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్, డీకే అరుణ గద్వాల, విజయశాంతి మెదక్ లేదా గ్రేటర్ హైదరాబాద్ లోని ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారట.