కోస్తాలో ఇలా.. మిగిలిన చోట్ల అలా.. టీడీపీ నేత‌ల తీరిదే సారూ..!


ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా.. కొత్త రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. గ‌తంలో అధినేత చంద్ర‌బాబు ప‌ట్ల విధేయ‌త ప్ర‌ద‌ర్శించే నాయ‌కులు ఉండేవారు. అదే సమ‌యంలో పార్టీకి గైడ్ చేసే నాయ‌కులు కూడా క‌నిపించేవారు. అయితే.. ఇప్పుడు సీనియ‌ర్లు ఎక్క‌డా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఒక్క కోస్తా ప్రాంతంలోనే.. సీనియ‌ర్లుగా ఉన్న బుచ్చ‌య్య చౌద‌రి..య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. వంటివారు క‌నిపిస్తున్నారు.

వీరు కూడా.. అడ‌పాద‌డ‌పా.. వ్యాక్య‌లు చేయ‌డం.. ప్ర‌భుత్వంపై ఏదో రెండు మూడు కామెంట్లు చేయ‌డం.. వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు. ఫ‌లితంగా.. పార్టీకి ఎలాంటి ప్ర‌యోజనం ఉంద‌నేది ఒక చ‌ర్చ‌. ఇదిలావుంటే.. ఇత‌ర ప్రాంతాలైన ఉత్త‌రాంధ్ర‌, సీమ జిల్లాల్లో ఇది కూడా లేద‌ని అంటున్నారు. అంటే.. అటు వైపు ప్రాంతాల్లో.. క‌నీసం.. మీడియా ముందుకు వ‌స్తున్న వారు కూడా క‌నిపించ‌డం లేదని చెబుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌ను తీసుకుంటే.. విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ నేత‌ల వాయిస్ వినిపించ‌డం లేదు.

విశాఖ‌లో అస‌లు పార్టీకి నాయ‌కులు.. ఉన్నారా? లేరా? ఉంటే ఏం చేస్తున్నారు? అనేది.. చంద్ర‌బాబుకైనా తెలుసో లేదో.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో మాత్రం అచ్చ‌న్నాయుడు, ఎంపీ రామ్మోహ‌న్‌ వాయిస్ మాత్ర‌మే వినిపిస్తోంది. మిగిలిన వారు ముక్త స‌రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక‌, సీమ‌లోకి వ‌స్తే.. నాయ‌కులు పెద్ద‌గా ముందుకు రావ‌డం లేదు. చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు వెళ్తే.. పండ‌గ లేక‌పోతే.. దండ‌గ అన్న‌ట్టుగా ఉంది.

నిన్న మొన్న‌టి వ‌రకు మాజీ మంత్రి..అమ‌ర్నాథ్‌రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న సైలెంట్ అయ్యారు. న‌ల్లారి కిశోర్‌కుమార్ కూడా పెద్ద‌గా యాక్టివ్ కాలేక పోతున్నారు. క‌ర్నూలులో నాయ‌కుల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా ఉంది. అనంత‌లో కాల్వ‌, ప‌రిటాల ఫ్యామిలీలే.. అంతో ఇంతో దూకుడుగా ఉన్నాయి. క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కొంత‌వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా.. తెలుగు దేశం నాయ‌కుల ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు.. లెక్క‌లు వేసుకునే ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.