కొత్త సినిమాలు అడ్ర‌స్ లేవు

అనుకున్న‌దే అయింది. జూన్ చివ‌రి వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వెల‌వెల‌బోయింది. ఈ వారానికి చెప్పుకోద‌గ్గ సినిమానే లేదు. పెద్ద సినిమాల సంద‌డి వేస‌వితోనే ముగియ‌గా.. ఈ నెల ఆరంభం నుంచి మీడియం రేంజ్ సినిమాలే వ‌స్తున్నాయి. కానీ చివ‌రి వారానికి వ‌చ్చేస‌రికి ఆ స్థాయి సినిమాలు కూడా లేవు. స‌మ్మ‌త‌మే, చోర్ బ‌జార్, 7 డేస్ 6 నైట్స్ లాంటి చిన్న సినిమాలే బ‌రిలో నిలిచాయి. కానీ ఇవి కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం విఫ‌ల‌మ‌య్యాయి.

ఉన్నంత‌లో స‌మ్మ‌త‌మే సినిమా ప‌రిస్థితి మెరుగు. ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి జంట‌గా న‌టించ‌డం, ట్రైల‌ర్ ప‌ర్వాలేద‌నిపించ‌డం, గీతా ఆర్ట్స్ ఈ సినిమాను రిలీజ్ చేయ‌డంతో కాస్త బ‌జ్ వ‌చ్చిందీ చిత్రానికి. దీంతో స‌మ్మ‌త‌మే ఓ మోస్త‌రుగా ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. కానీ టాక్ ఏమంత బాగా లేదీ చిత్రానికి. రివ్యూల‌న్నీ నెగెటివ్‌గా ఉన్నాయి.

ఓ మోస్త‌రు ఆక్యుపెన్సీతో వీకెండ్లో ఓ మోస్త‌రు వ‌సూళ్లు రాబ‌ట్టిన స‌మ్మ‌త‌మే.. ఆదివారం త‌ర్వాత చ‌ల్ల‌బ‌డిపోయింది. చోర్ బ‌జార్‌కు మ‌రీ దారుణమైన టాక్ రావ‌డంతో ఏ ద‌శ‌లోనూ అది పుంజుకోలేదు. మాస్ సినిమా కావ‌డం వ‌ల్ల తొలి రోజు కాస్త వ‌సూళ్లు వ‌చ్చాయి. త‌ర్వాత సినిమాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఎం.ఎస్.రాజు సినిమా 7 డేస్ 6 నైట్స్ ప్రేక్ష‌కుల దృష్టిని అంత‌గా ఆక‌ర్షించ‌లేక‌పోయింది. డ‌ర్టీ హ‌రి త‌ర‌హాలో ఎరోటిక్ సీన్స్, థ్రిల్లింగ్ కంటెంట్ ఉంటుంద‌ని ఆశించిన ప్రేక్ష‌కుల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. మ‌రీ డ‌ల్ మూవీ కావ‌డంతో సినిమాకు టాక్ రాలేదు. వ‌సూళ్లూ లేవు. గ్యాంగ్ స్ట‌ర్ గంగ‌రాజు, స‌దా న‌ను న‌డిపే.. ఇలా కొన్ని చిన్న సినిమాలు ఈ వారం విడుద‌ల‌య్యాయి కానీ.. వాటిని ప్రేక్ష‌కులు ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ఇక ప్రేక్ష‌కుల దృష్టంతా ఈ శుక్ర‌వారం రానున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మీదే ఉంది.