ఎన్టీఆర్ విగ్ర‌హానికి వైసీపీ రంగులు..

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌పైనే ఆయ‌న‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. మ‌రో రెండు రోజుల్లో ఇక్క‌డ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఉన్న నేప‌థ్యంలో అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. టీడీపీ నేత‌ల‌ను రెచ్చ‌గొట్టి.. ఏదో ఒక విధంగా ఇక్క‌డ ర‌సాభాస సృష్టించాల‌నే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. ఆ పార్టీ జెండా రంగులు వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలో బొమ్ములూరు ఉంది. ఇక్క‌డున్న ఎన్టీఆర్ విగ్ర‌హానికి కొంద‌రు రాత్రికి రాత్రి వైసీపీ రంగులు వేశారు. దీంతో విషయం తెలుసుకొని బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఇత‌ర నాయ‌కులు ప‌రిస‌రాల‌ను గ‌మ‌నించారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసిపి రంగులు వేయడాన్నివారు తీవ్రంగా ఖండించారు. అనంత‌రం విగ్ర‌హానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైసిపి రంగులు చెరిపి వేసి టీడీపీ జెండా రంగులు వేయించారు.

ఇదిలావుంటే.. స్థానిక ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని అనుచ‌రులే దీనికి పాల్ప‌డ్డార‌ని.. టీడీపీ నేత‌లు ఆరోపించారు. నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నార‌ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమ‌ర్శించారు. మహానాడు బ్యానర్ల పై, అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటు పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు.

తమ నాయకుడు విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గ‌మ‌ని, మినీ మ‌హానాడును ఉద్దేశ పూర్వ‌కంగా అడ్డుకోవ‌డంతోపాటు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునే చ‌ర్య‌ల్లో ఇది భాగ‌మేన‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు నేత‌లు తెలిపారు.