గాయకుడి మర్డర్.. ఉత్తరాదిన ప్రకంపనలు

పంజాబ్ రాష్ట్రం నిన్నట్నుంచి అట్టుడికిపోతోంది. దీని తాలూకు ప్రకంపనలు ఉత్తర భారత దేశం అంతటా విస్తరిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఒక సెలబ్రెటీ ప్రాణాలు కోల్పోవడమే ఈ ఉద్రిక్తతకు కారణం. సిద్ధు మూసెవాలా.. 28 ఏళ్ల ఈ యువ సింగర్ పంజాబ్‌లో సూపర్ పాపులర్. అంతర్జాతీయ స్థాయిలో అతను పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. సినిమాలతో పాటు పాప్ పాటలతోనూ అతను పాపులర్ అయ్యాడు. ఈ పాపులారిటీ అతను కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఎన్నికల్లో అతను విజయం సాధించలేకపోయినప్పటికీ జనాదరణ బాగానే ఉంది.

ఐతే అతడికి ప్రత్యర్థుల నుంచి ప్రాణ హాని ఉన్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాం నుంచే అతడికి పోలీస్ రక్షణ కల్పిస్తున్నారు. ఐతే రెండు రోజుల కిందట సిద్ధుతో పాటు సెలబ్రెటీలు కొందరికి పోలీసు రక్షణ తొలగిస్తూ ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడమే కాక.. కొన్ని పత్రికలకు ఈ విషయాన్ని లీక్ చేశారు కూడా. ఇలా సిద్ధుకు పోలీస్ ప్రొటెక్షన్ తీసేశారో లేదో.. 24 గంటలు గడిచేలోపు అతడి ప్రాణాలు పోయాయి. ఒక రౌడీ గ్యాంగ్ జీపులో ప్రయాణిస్తున్న సిద్ధును పబ్లిగ్గా కాల్చేసింది. ఒంటి మీద 20కి పైగా తూటాలు దిగాయి. సిద్ధుకు పోలీసు రక్షణ తొలగించిన ఒక్క రోజులో ఈ దారుణం జరగడంతో ఆప్ సర్కారుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.

పోలీస్ ప్రొటెక్షన్ తీసేయడమే కాక.. ఉద్దేశపూర్వకంగా ఈ సున్నితమైన సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం.. అది తెలిసి ప్రత్యర్థులు సిద్ధు మీద దాడి చేసి చంపేయడంతో పంజాబ్ అట్టుడికి పోతోంది. సీఎం భగవత్ మన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీద తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. సిద్ధు మరణానికి బాధ్యత వహిస్తూ వీళ్లిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీని ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రభుత్వం మీద గట్టిగానే పడేలా ఉంది.