మెగా ఫ్యాన్స్ ఏమయ్యారు?

ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టే ప్ర‌తి హీరో కూడా 1 స్టార్ ఇమేజ్‌, మాస్ ఫాలోయింగ్ కోసం వెంప‌ర్లాడుతుంటాడు. అందుక్కార‌ణం అలాంటి ఇమేజ్, ఫాలోయింగ్ వ‌స్తే.. ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండ‌దు. ఎంత చెత్త సినిమా తీసినా.. ఆరంభ వ‌సూళ్ల‌లో సినిమా కాస్త సేఫ్ అవ్వ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. టాలీవుడ్ టాప్ స్టార్లంద‌రికీ ఉన్న అడ్వాంటేజీ ఇదే. ఎలాంటి టాక్ వ‌చ్చినా వాళ్ల సినిమాల‌కు ఈమాత్రం వ‌సూళ్లు గ్యారెంటీ అనే న‌మ్మ‌కం ట్రేడ్ వ‌ర్గాల్లో ఉంటుంది. ఇలా ఓపెనింగ్స్ ప‌రంగా గ్యారెంటీ ఉన్న స్టార్ల‌లో మెగా హీరోలు ముందు వ‌రుస‌లో ఉంటారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఈ విష‌యంలో తిరుగులేదు. వేరే హీరోల హిట్ సినిమాల‌కు వ‌చ్చే వ‌సూళ్లు ఆయ‌న ఫ్లాప్ సినిమాల‌కు వ‌స్తుంటాయ‌ని అంటుంటారు. చిరు ప్రైమ్ టైం చూసిన వాళ్ల‌కు ఇదేమీ ఎగ్జాజ‌రేష‌న్‌గా అనిపించ‌దు. ఇందుకు చాలా ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తాయి కూడా. ఇక ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కూడా తిరుగులేని ఇమేజ్, ఫాలోయింగ్ సంపాదించిన వాడే. అత‌డి సినిమా విన‌య విధేయ రామ డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుని కూడా మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది.

అలాంటిది చిరు-చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌లిసి చేసిన ఆచార్య సినిమాకు వ‌చ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు అవాక్క‌వుతున్నారు. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వ‌చ్చినా స‌రే.. మెగా అభిమానులు, మాస్ ప్రేక్ష‌కులు, చిరును ఇష్ట‌ప‌డే ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంతా కలిసి కొంత వ‌ర‌కు సినిమాను ముందుకు తీసుకెళ్తార‌ని ఆశించారు.

కానీ తొలి రోజు త‌ర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డ్డ తీరు చూస్తే.. సినిమాకు అండ‌గా నిల‌బ‌డ‌తారనుకున్న వాళ్లంతా వెన‌క్కి త‌గ్గార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముఖ్యంగా మెగా అభిమానులే ఈ సినిమా ప‌ట్ల అంత‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేద‌న్న‌ది స్ప‌ష్టం. ప్రి రిలీజ్ హైప్ అంత‌గా క‌నిపించ‌క‌పోవ‌డం, అడ్వాన్స్ బుకింగ్స్ డ‌ల్లుగా ఉండ‌డం చూసే మెగా అభిమానుల నిరుత్సాహం బ‌య‌ట‌ప‌డింది.

చిరు-చ‌ర‌ణ్ క‌లిసి చేసిన సినిమా వ‌స్తుంటే వారిలో ఉండాల్సినంత ఉత్సాహం క‌నిపించ‌లేదు. ఇక రిలీజ్ రోజు థియేట‌ర్ల ద‌గ్గ‌ర, త‌ర్వాత సోష‌ల్ మీడియాలో కూడా వారి సంద‌డి క‌నిపించ‌లేదు. నెగెటివ్ టాక్ అనుకున్న దాని కంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నా దాన్ని వాళ్లు వాళ్లు దీటుగా ఎదుర్కోలేదు. ఇక థియేట‌ర్ల‌లోనూ వారి సంద‌డి పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఆచార్య‌కు ఇంత డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ రావ‌డంలో ప‌రోక్షంగా మెగా ఫ్యాన్స్ పాత్ర కూడా ఉంద‌నే చెప్పాలి.