ఏ బెంచ్ మార్క్ అయినా.. రాజమౌళికే సాధ్యం

రికార్డులంటే మామూలుగా హీరోల పేర్లే వినిపిస్తాయి. వాళ్ల పేర్ల మీదే రికార్డుల చ‌ర్చ ఉంటుంది. కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పుడు దీనికి మిన‌హాయింపుగా నిలుస్తోంది. హీరోల‌ను మించి ఇమేజ్ సంపాదించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.. రికార్డుల‌న్నింటినీ త‌న పేరిటే లిఖించుకుంటున్నాడు. ఒక్కో సినిమాతో రాజ‌మౌళి రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్న తీరు చూస్తే.. ఆయ‌న విజ‌యాల్లో హీరోల‌కు ఏమాత్రం క్రెడిట్ ఇవ్వాలో అన్న సందేహం క‌లుగుతోంది.

టాలీవుడ్లో ప్ర‌తి బెంచ్ మార్క్ ద‌గ్గ‌రా ఇప్పుడు రాజ‌మౌళి పేరే లిఖిత‌మై ఉండ‌టం విశేషం. ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రం వ‌ర‌కు తొలి 50 కోట్ల షేర్ మార్కును అందుకున్న సినిమా రాజ‌మౌళిదే. మ‌గ‌ధీర‌తో జ‌క్క‌న్న ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఆంధ్రప్ర‌దేశ్ వ‌ర‌కు 50 కోట్ల షేర్ మార్కును అందుకోవ‌డ‌మే కాదు.. ఆ రోజుల్లోనే మ‌గ‌ధీర‌తో మొత్తంగా 75 కోట్ల మార్కును కూడా దాటేశాడు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో తొలి 100 కోట్ల షేర్ సినిమాను అందించిన ఘ‌న‌త కూడా జ‌క్క‌న్న‌దే. 2015లో బాహుబ‌లి: ది బిగినింగ్‌తో ఈ బెంచ్ మార్క్‌ను అందుకున్నాడు జ‌క్క‌న్న‌.

తెలుగు సినిమాకు ఈ స‌త్తా ఉంద‌ని జ‌క్క‌న్న చాటిచెప్పాక‌.. మ‌రిన్ని సినిమాలు వంద కోట్ల షేర్ క్ల‌బ్బులో చేరాయి. ఇక మూడేళ్ల త‌ర్వాత బాహుబ‌లి: కంక్లూజ‌న్‌తో ఇంకో అనిత‌ర సాధ్య‌మైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు జ‌క్క‌న్న‌. ఈ చిత్రం రూ.150 కోట్ల షేర్ మార్కును దాటేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ‌ల్లో క‌లిపి రూ.190 కోట్ల దాకా ఈ చిత్రం షేర్ రాబ‌ట్టింది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తొలి రూ.200 కోట్ల షేర్ మార్కును అందుకున్న సినిమా సైతం జ‌క్క‌న్న‌దే. ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఘ‌న‌తను అందుకుంది. ఈ లెక్క‌ల‌న్నీ తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే ప‌రిమితం. ఓవ‌రాల్ వ‌సూళ్లలో మ‌రిన్ని రికార్డులు జ‌క్క‌న్న ఖాతాలో ఉన్నాయి. ఇలా ప్ర‌తి బెంచ్ మార్క్ ద‌గ్గ‌రా జ‌క్క‌న్న పేరుండ‌టం ఆయ‌న స్థాయిని తెలియ‌జేస్తుంది.