వైసీపీలో డిజిట‌ల్ మీడియా లొల్లి!

వైసీపీలో ఒక అత్యంత కీల‌క విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అవునా.. ఇది నిజ‌మేనా..? అంటూ.. నాయ కులు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి కార‌ణం.. వైసీపీలోని రెండు విభాగాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వివాదాలు జ‌రుగుతుండ‌డ‌మేన‌ని తెలిసింది. ప్ర‌స్తుత డిజిట‌ల్ ప్ర‌పంచంలో .. ఏ పార్టీకైనా.. ప్రింట్ క‌న్నా కూడా.. డిజిట‌ల్ మీడియాలే ప్ర‌ధానం. డిజిట‌ల్ మీడియా వేదికగానే.. పార్టీలు త‌మ వ్యూహాలను ముందుకు తీసుకువెళ్తున్నాయి. అయితే.. వైసీపికి కూడా టీడీపీకి ఉన్న‌ట్టుగానే.. రెండు విభాగాలు ఉన్నాయి.

ఒక‌టి డిజిట‌ల్ , రెండు వెబ్‌సైట్‌. ఈ రెండు మాధ్య‌మాల ద్వారా.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్రమోట్ చేస్తున్నారు. డిజిట‌ల్ మీడియా, వైసీపీ వెబ్‌సైట్ కూడా వైసీపీకి రెండు క‌ళ్లుగా పేర్కొంటున్నారు. అయితే.. కొన్నాళ్లుగా.. డిజిట‌ల్ మీడియాపై వెబ్‌సైట్ వైసీపీ నేత‌లు.. ఆధిప‌త్యం చ‌లాయిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా.. డిజిట‌ల్ మీడియాలో ప‌నిచేస్తున్న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు.. జీతాలు కూడా ఇవ్వ‌కుండా వేధిస్తున్నార‌ని.. విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

దీనికి కార‌ణం.. రెండు విభాగాల‌ను త‌న‌కే అప్ప‌గించాలంటూ.. ఒక కీల‌క అధికారి.. పార్టీలోని కీల‌క స‌ల‌హాదారు ద‌గ్గ‌ర పంచాయ‌తీ పెట్టార‌ట‌. అయితే.. ఈ విష‌యంలో ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, స‌ద‌రు అధికారి మాత్రం డిజిట‌ల్ ను కూడా త‌న‌కే అప్ప‌గించేశార‌ని.. పేర్కొంటూ.. తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నార‌ట‌. దీంతో డిజిట‌ల్ మీడియా దూకుడు త‌గ్గిపోయింది. పైగా ఇంచార్జ్‌ను కూడా సాగ‌నంపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

దీంతో ఇప్పుడు డిజిట‌ల్ మీడియా అస‌లు ఉంటుందా?  ఉండ‌దా? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. వైసీపీ నాయ‌కులు మాత్రం డిజిట‌ల్ మీడియాను పెద్ద‌గానే న‌మ్ముకున్నారు. త‌మ‌కు ఏం కావాల‌న్నా.. ఏం చేయాల‌న్నా.. డిజిట‌ల్ మీడియాలోనే చేస్త‌న్నారు. ఇప్పుడు ఈ మీడియా క‌నుక ఇబ్బందుల్లో ప‌డితే.. త‌మ‌కు న‌ష్ట‌మేన‌న్న‌ది వారి వాద‌న‌. మ‌రోవైపు.. టీడీపీ ఐటీడీపీ పేరుతో డిజిట‌ల్ మీడియాను ప‌రుగులు పెట్టిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. ఈ వివాదం ప‌రిష్క‌రించాల‌ని .. వారు కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.