ల‌క్ష ఉద్యోగాలు మాయం చేసిన కేసీఆర్‌: బండి సంజ‌య్

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల బొనంజా గురించి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై నిరుద్యోగుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు రాజ‌కీయ పార్టీలు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని  మండిపడ్డారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కోర్టు కేసులు, ఇతరత్రా సాకులతో ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తే సహించబోమన్నారు. ఈ విషయంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా… ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల్లోకి వెళ్లబోమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న‌పై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో నేత‌ల‌తో క‌లిసి బండి సంజ‌య్ స్పందించారు.  కేసీఆర్ మోసపూరిత ప్రకటనలు విని విని ఇక ఉద్యోగాలు రావని విసుగుపుట్టి వందలమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన త‌ర్వాత ఇన్నాళ్లకైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు కరిగి అసెంబ్లీలో ఈరోజు 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం సంతోష‌క‌ర‌మని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల ప్రకటన బీజేపీ సాధించిన విజయమ‌ని, ఉద్యోగాల భర్తీ కోసం అనేక పోరాటాలు చేశామ‌ని సంజ‌య్ పేర్కొన్నారు.

“అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయకుంటే నిరుద్యోగులతో కలిసి హైదరాబాద్ లో  ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తామని ప్రకటించాం. మిలియన్ మార్చ్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. లక్షలాదిగా నిరుద్యోగ యువకులు హైదరాబాద్ రావడానికి సిద్ధమ‌య్యారు. ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ కు వెన్నులో వణుకుపుట్టింది. ఇప్పుడు కూడా ఉద్యోగాల ప్రకటన చేయకపోతే యువతీ యువకులు భరతం పడతరని ఆయనకు అర్ధమైంది. అట్లాగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ రెండిటి దెబ్బతో ఆగమేఘాల మీద అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేశాడు“ అని సంజ‌య్ పేర్కొన్నాడు.

కేసీఆర్ ల‌క్ష ఉద్యోగాల మాయ చేశార‌ని బండి సంజ‌య్ ఆరోపించారు. “కేసీఆర్‌…2014లోనే కదా ఇదే అసెంబ్లీలో లక్షా 7 వేల ఉద్యోగాలిస్తానన్నవ్?  అంతకుముందేమో బహిరంగ సభలో ఇంటికో ఉద్యోగమిస్తానని చెప్పింది నువ్వు కాదా? రెండేండ్ల క్రితం నువ్వు నియమించిన బిశ్వాల్ కమిటీ రాష్ట్రంలో ఒక లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. `కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తో కలిపి 91 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానంటున్నవ్? మరి మిగిలిన లక్ష ఉద్యోగాలేమైనయ్. కాకి ఎత్తకపోయిందా? లేక నువ్వు మింగేసినవా? ఆ లెక్క సంగతి ఎందుకు చెప్పలేదు?“ అంటూ బండి సంజ‌య్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. “లక్ష ఉద్యోగాల లెక్క తేల్చకుండా ఏదో బిచ్చమేసినట్లుగా ఉద్యోగాలు ప్రకటించి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నవా?   లెక్కలన్నీ దాచిపెట్టి అసెంబ్లీ సాక్షిగా  మరోమారు ప్రజలను మోసం చేస్తావా? గత 8 ఏళ్లుగా నువ్వు చెబుతుంది ఇదే.. కదా…ఇదిగో ఉద్యోగాల భర్తీ.. అదిగో నోటిఫికేషన్ అని ఊరిస్తనే ఉన్నవ్ కదా….  నీ మాటల గారడీతో ప్రజలను మోసం చేసే కాలం పోయింది. ఎప్పటికప్పుడు నీ ముసుగును ప్రజలకు చెబుతూనే ఉన్నాం“ అని సంజ‌య్ వ్యాఖ్యానించారు.