తీన్మార్ మ‌ల్ల‌న్న కేడ‌ర్‌పై ఆర్ఎస్ క‌న్ను!

రాజ‌కీయాలు మ‌హా విచిత్ర‌మైన‌వి. త‌మ బ‌లాన్ని పెంచుకునేందుకు నాయ‌కులు ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దిలిపెట్ట‌రు. అన్ని ర‌కాలుగా త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతారు. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా అదే మార్గంలో వేగంగా అడుగులు వేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తీన్మార్ మ‌ల్ల‌న్న బీజేపీలో చేర‌డంతో ఆయ‌నకు ఇన్ని రోజులుగా ఉన్న కేడ‌ర్‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌వీణ్ క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

సొంత పార్టీ..
ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌గా ఉన్న చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఆది నుంచే త‌న మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నార‌ని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం దొంగ ప్ర‌భుత్వ‌మ‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్‌పై ఆయ‌న పోరాటం న‌చ్చి.. ఆయ‌న బ‌హుజ‌న‌వాదం న‌చ్చి చాలా మంది మ‌ల్ల‌న్న‌తో క‌లిసి న‌డిచేందుకు ముందుకు వ‌చ్చారు. దీంతో మ‌ల్ల‌న్న కొత్త పార్టీ పెడ‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన‌ప్ప‌టికీ అధికార పార్టీ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. అనూహ్యంగా రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఆయ‌న కొత్త పార్టీకి అడుగులు ప‌డుతున్నాయ‌ని అనిపించింది.

ఆ కేసుల‌తో..
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత మ‌ల్ల‌న్న త‌న రాజ‌కీయ దూకుడు పెంచారు. కానీ అదే స‌మ‌యంలో త‌న‌పై కేసులు న‌మోద‌వ‌డంతో ఆయ‌న ట‌ర్న్ తీసుకోక త‌ప్ప‌లేదు. కేసీఆర్ త‌న‌పై అక్ర‌మంగా కేసులు పెట్టించార‌ని ఆరోపించిన ఆయ‌న జైళ్లో ఉండ‌గానే బీజేపీలో చేర‌తాన‌ని ప్ర‌క‌టించారు. బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే కాషాయ కండువా క‌ప్పుకున్నారు. దీంతో బ‌హుజ‌న వాదంతో ఆయ‌న వెంట న‌డిచిన కేడ‌ర్ ప‌రిస్థితి ఇప్పుడు ఏమిట‌నే ప్ర‌శ్న మొద‌లైంది. వాళ్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా లేరు.

ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవాల‌ని ప్ర‌వీణ్ ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి బీఎస్పీలో చేరిన‌ ఆయ‌న‌.. ఇప్పుడు అదే భావ‌జాలంతో ఉన్న మ‌ల్ల‌న్న కేడ‌ర్‌ను త‌న వైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగారు. వాళ్ల‌తో ఇప్ప‌టికే ఓ సారి స‌మావేశ‌మైన ఆయ‌న త‌న‌తో క‌లిసి సాగాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో మ‌ల్ల‌న్న జిల్లా యాత్ర‌లు చేయ‌డంతో క్షేత్ర స్థాయిలోనూ ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన కేడ‌ర్ ఏర్ప‌డింది. ఇప్పుడు దాన్ని సొంతం చేసుకోవాల‌న్న‌ది ప్ర‌వీణ్ వ్యూహం. మ‌రి ఈ విష‌యంలో ఆయ‌న ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.