‘రాధేశ్యామ్’కు అంతమంది సరిపోలేదా?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలకు వరుసగా సంగీత దర్శకుల సమస్య తలెత్తుతోంది. ‘సాహో’కు ఈ విషయంలో ఎంత గందరగోళం నడిచిందో తెలిసిందే. ముందు ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్‌లను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. కానీ వాళ్ల మ్యూజిక్ విషయంలో మేకర్స్ సంతృప్తి చెందలేదు. విడుదలకు కొన్ని నెలల ముందు వారిని తప్పించారు. తర్వాత ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడితో హడావుడిగా చేయించున్నారు.

బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతలు జిబ్రాన్‌కు అప్పగించారు. ప్రభాస్ నెక్ట్స్ మూవీ ‘రాధేశ్యామ్’ విషయంలోనూ ఈ గందరగోళం కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. ఈ చిత్రం మొదలైన ఏడాది వరకు సంగీత దర్శకులనే ఖరారు చేయలేదు. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్‌ను.. హిందీ వెర్షన్‌కు మిథూన్, అర్మాన్ మాలిక్, అర్జీత్ సింగ్, మనన్ భరద్వాజ్‌లను సంగీత దర్శకులుగా ఖరారు చేశారు.

వీరితో మంచి ఔట్ పుటే రాబట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా రిలీజైన పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఐతే ‘రాధేశ్యామ్’కు వీరిలో నేపథ్య సంగీతం అందించేది ఎవరు అనే విషయంలో సందిగ్ధత నడుస్తోంది. ఆర్ఆర్ వరకు అన్ని వెర్షన్లకూ జస్టిన్‌నే ఎంచుకున్నట్లుగా ఇంతకుముందు వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడేమో ఆ ఆలోచన మారిందంటున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే ఏ సంగీత దర్శకుడూ లేనంత సూపర్ ఫాంలో ఉన్న తమన్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇటీవల ‘అఖండ’కు తమన్ చేసిన స్కోర్ చూసి అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్‌తో ‘రాధేశ్యామ్’కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పించాలని చూస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కానీ మాస్ సినిమాలకు తమన్ అదరగొట్టేస్తాడు కానీ.. ‘రాధేశ్యామ్’ లాంటి లవ్ స్టోరీస్‌కు అతడి స్కోర్ సూటవుతుందా అన్నదే డౌటు. ఈ విషయంలో జస్టిన్ ప్రభాకరే బెటరేమో అనిపిస్తోంది.